News

హసీనాను స్వదేశానికి రప్పించేందుకు ఇంటర్‌పోల్‌ సహాయం కోరతాం

262views

భారత్‌లో తలదాచుకుంటున్న తమ మాజీ ప్రధానమంత్రి షేక్‌ హసీనాను స్వదేశానికి రప్పించేందుకు ఇంటర్‌పోల్‌ సహాయం కోరనున్నట్లు బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం ఆదివారం తెలిపింది. ఈ ఏడాది జులై-ఆగస్టు నెలల్లో విద్యార్థుల ఉద్యమాన్ని ఆమె నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వం దారుణంగా అణచివేయడంతో 753 విద్యార్థులు చనిపోయారని పేర్కొంది. వేలమంది గాయపడ్డారని వెల్లడించింది. ఈ దారుణాలపై నమోదైన కేసుల్లో హసీనాతోపాటు అప్పటి ప్రభుత్వంలోని మరికొందరు నాయకులు విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఇంటర్‌పోల్‌ ద్వారా అతి త్వరలోనే వారిపై రెడ్‌ నోటీసులు జారీ చేస్తామని న్యాయ వ్యవహారాల సలహాదారు అసిఫ్‌ నజ్రుల్‌ తెలిపారు. నిందితులు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా స్వదేశానికి రప్పిస్తామని పేర్కొన్నారు.

హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ పార్టీ మద్దతుదారులు ఢాకాలో ఆదివారం ర్యాలీ నిర్వహించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. విద్యార్థి సంఘమైన ‘యాంటీ డిస్క్రిమినేషన్‌ స్టూడెంట్‌ మూవ్‌మెంట్‌’ కార్యకర్తలు ఆ పార్టీ మద్దతుదారులపై దాడులకు దిగి ర్యాలీ ప్రయత్నాలను భగ్నం చేశారు. ఈ విద్యార్థి సంఘమే బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో కీలక పాత్ర పోషించిన సంగతి గమనార్హం.