News

కెనడాలో ఖలిస్థాన్‌ ఉగ్రవాది అర్ష్‌ దల్లా అరెస్టు

233views

భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించిన ఖలిస్థానీ వేర్పాటువాది అర్షదీప్‌ సింగ్‌ అలియాస్‌ అర్ష్‌ దల్లాను కెనడా పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కెనడాలో గతేడాది జులైలో హత్యకు గురైన ఖలిస్థాన్‌ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌కు అర్ష్‌ దల్లా సన్నిహితుడు. పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన దల్లాపై భారత్‌లో హత్య, వేధింపులు, అపహరణ సహా పలు కేసులు ఉన్నాయి. గతేడాది జనవరిలో భారత ప్రభుత్వం అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. పెద్ద మొత్తంలో డ్రగ్స్, ఆయుధాల స్మగ్లింగ్‌లో ఇతడి పాత్ర ఉందని కేంద్ర హోంమంత్రిత్వశాఖ కూడా తెలిపింది. దల్లాకు సంబంధించిన పలుకేసులను జాతీయ విచారణ సంస్థ్బఎన్‌ఐఏ్శ దర్యాప్తు చేస్తోంది. 2020లో దల్లా.. కెనడాకు పారిపోయాడు. గత నెల 28న కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌లోని మిల్టన్‌లో జరిగిన కాల్పుల సంఘటన సందర్భంగా పోలీసులు దల్లాను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు కెనడా పోలీసులు ప్రకటించినా పేర్లు మాత్రం వెల్లడించలేదు.