
కెనడాలో ఖలిస్తానీలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేసిన సంఘటనలు వున్నాయి. భారత్ కి వ్యతిరేకంగా అనేక ప్రదర్శనలు చేశారు. దేవాలయాలపై కూడా దాడులు చేశారు. తాజాగా బ్రాంప్టన్ లోని హిందూ దేవాలయంపై కూడా ఖలిస్తానీ అతివాదులు దాడి చేశారు. ఈ అల్లరి మూకల్లో కెనడా పోలీసులు కూడా కలిసిపోయారు. తాజాగా బ్రాంప్టన్ లోని దేవాలయం దాడిలో పాల్గొన్నారు. దీంతో ప్రభుత్వం ఆ పోలీసు అధికారిని సస్పెండ్ చేసింది. అక్టోబర్ లో జరిగిన ఖలిస్తానీ హింసాత్మక నిరసనల్లో కూడా అదే పోలీసు అధికారి పాల్గొన్నట్లు ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టు డొనాల్డ్ బెస్ట్ వెల్లడించారు. అంతేకాకుండా బ్రాంప్టన్ లోని హిందూ దేవాలయంలో వున్న హిందువులపై కూడా ఖలిస్తానీ వేర్పాటువాదులు భౌతికంగా దాడికి దిగారన్నారు.
‘‘నవంబర్ 3 వ తేదీన మధ్యాహ్నం ఖలిస్తానీ వేర్పాటువాదులు నిరసన వ్యక్తం చేస్తూ బ్రాంప్టన్ హిందూ దేవాలయం దగ్గరికి వచ్చి, బయట నిరసన వ్యక్తంచేశారు. కెనడాలో ఇది క్రిమినల్ నేరం కిందికి వస్తుంది. మతపరమైన సమావేశానికి భంగం కలిగించడానికి అనుమతి లేదు. మొదటి రాయి ఎవరు విసిరారో, ఎవరిని కొట్టారో, ఎవరు మొదట దూకారో నాకు తెలియదు.చాలా మంది ఖలిస్తానీ వేర్పాటువాదులు మాత్రం అక్కడి హిందువులపై భౌతికంగా దాడి చేశారని మాత్రం నాకు తెలుసు. ఆ వీడియోలు చూశా. చాలా భయానకంగా వుంది. ఆ హింసాత్మక గుంపులో ఓ పోలీసు అధికారి వున్నాడని తెలుసుకున్నా.ఇదే విషయం పోలీసు అధికారులను కూడా అడిగి తెలుసుకున్నా. అది నిజమేనని ధ్రువీకరించారు. అతను ఆఫ్ డ్యూటీ పోలీస్ అధికారి అని సస్పెండ్ చేశామని, అంతర్గత విచారణ సాగుతోందని చెప్పారు. అతని పేరు సార్జంట్ హరీందర్ సోహి. ఖలిస్తానీ జెండా పట్టుకొని కనిపించాడు’’ అని జర్నలిస్టు డొనాల్డ్ బెస్ట్ తెలిపారు.
మరోవైపు అక్టోబరు మాసంలో ఖలిస్తానీ వేర్పాటువాదుల నిరసనలోనూ ఇదే పోలీసు అధికారిని తాను చూసినట్లు జర్నలిస్టు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘‘అక్టోబర్ మాసం మధ్యలో టొరంటో డౌన్ టౌన్ లో ఖలిస్తానీల నిరసన జరిగింది. ఆ నిరసనలో నేను ఆ పోలీసు అధికారిని చూశాను. ఈ విషయం పోలీసులకు అప్పుడే తెలుసు. అందులో నాకు ఎలాంటి సందేహమూ లేదు’’ అని జర్నలిస్టు కుండబద్దలు కొట్టారు.





