
హరుని చాపము రాముడతి సత్త్వయుక్తి
బెరిగివేడిదె యెక్కు పెట్టుచున్నాడు.
అదరకు భూదేవి ఆత్మలో నీవు
చెదరి చలింపకు శేషాహి నీవు
కడక ధరింపుము కమతేంద్ర నీవు
కడు నేమరకుడు దిక్కరు లార మీకు రామలక్ష్మణులను వెంటబెట్టుకొని విశ్వామిత్ర మహర్షి మిథిలానగరానికి బయలుదేరి వెళ్లాడు. జనక మహారాజు గౌరవించాడు. విశ్వామిత్రుడు “జనక మహారాజా! నీవద్ద ఏదో ధనుస్సు ఉందని విన్నాము. కాస్త చూపిస్తారా! మా శిష్యులు రామ లక్ష్మణులు చూస్తారు. వారి కోరిక తీరుతుంది. చూసి, సంతోషించి వెళ్లిపోతారు” అన్నాడు. “ఎంత మాట మునిశ్రేష్ఠా! చూడండి, ఇది శివుని విల్లు, సనాతనమైనది. అనాదిగా ఉంటున్నది మా ఇంట్లో. శివధనుస్సును ఎక్కుపెట్టగలిగిన పరా క్రమశాలికి నా కుమార్తె నిచ్చి వివాహము జరి పిస్తానని ప్రకటించి ఉన్నాను. నా కుమార్తె సీత. అయోనిజ – వీర్యశుల్క” అన్నాడు జనకుడు. అప్పుడు విశ్వామిత్రుడు, “వత్సా, రామ చంద్రా ఆ ధనుస్సు సంగతి చూడు.” అన్నాడు. గుర్వాజ్ఞ. అందుకున్న రాముడు – విల్లు ఉన్న పెట్టే తెరిచాడు. ధనుస్సును చూశాడు. చేతిలోకి తీసుకున్నాడు. పైకెత్తాడు. ఎక్కుపెట్టాడు. చెవి దాకా లాగాడు. ఫెళఫెళమని విరిగింది విల్లు. ఆ ప్రక్రియ భయంకరా రావానికి అక్కడ ఉన్న వేలాది నృపతులు తెలివిదప్పి పడిపోయారు. స్పృహలు లేవు ఎవరికీ, విశ్వామిత్ర, జనక రామ లక్ష్మణులకు తప్ప, సీతాదేవి రాముణ్ణి వరించింది. మెడలో పూలహారం వేసింది. సీతారాముల వివాహం వైభవంగా జరిగింది. “రామా, ఇదిగో సీత. నీ సహధర్మచారిణి – నీడలా నిన్ను అనుస రిస్తుంది” అని అప్పగించాడు జనకుడు. రాముని శక్తికి ఇంకో పరీక్ష ముఖ్యమయినది – అశక్తుడికి తన పిల్లనిస్తాడా లేకపోతే జనకుడు తనకు అల్లుడిగా సజ్జనుడయినవాడు మాత్రమే రావాలని కోరుకోలేదు ఆయన. శక్తిమంతుడు కూడా కావాలి. మంచితనం ఉన్న మాత్రాన చాలదు. శక్తి కూడా ఉండాలి. అసమర్థ సజ్జనులవల్ల వాళ్లకూ సుఖం లేదు. లోకానికీ లేదు.
అసలు ఇంకో విషయం ఉంది. శివధనుస్సు ఎవరికి వంగుతుంది? ఎవరికి లొంగుతుంది? శివధనుస్సు అంటే జగత్తు. అనాదిగా ఉంది ఈ సృష్టి ఈ జగత్తు ఈ ప్రపంచం, ఎవరికి మోక రిల్లుతుంది? నమ్రమవుతుంది? వంచేవాడు కావాలి అంతే. “దునియా ఝుక్తోహై, ఝుకానే వాలే చాహియే” వంచగలిగినవాడు ఎవడు? రాముని వంటివాడు మాత్రమే. రాముని శక్తి ముందు మాత్రమే నతమస్తకమవుతుంది జగత్తు.. అంటే ధార్మిక శక్తికి మాత్రమే లొంగుతుంది. అధార్మిక శక్తికి లొంగదు, ఎదురు తిరుగుతుంది.
రావణుడు కూడా శివధనుస్సును వంచాలని ప్రయత్నించినవాడే. త్రిలోకాలను తన హస్తంలో ఉంచుకుందామనుకున్నవాడే. వంచగలిగాడా? వంచబోతే వచ్చి అది మీదపడ్డది. దాని క్రింద పాపం నలిగిపోయాడు. గిజగిజలాడాడు. ఎదురుకొట్టిందన్న మాట. తుపాకి వెనక్కి తన్నినట్లు, రావణుడు శక్తిమంతుడే కాని వాడు రాక్షసుడు, అధార్మికుడు. దుష్టుడు. రావణుడు కావచ్చు, దుర్యోధనుడు కావచ్చు, హిట్లరు కావచ్చు, స్టాలిన్ కావచ్చు ఎవరైతేనేం శక్తి ఉందనుకుంటే సరిపోదు. అధికారం ఉంది కదా అంటే పప్పు ఉడకదు. యుక్తాయుక్త విచక్షణ తెలియాలి. మంచి చెడ్డల అవగాహన ఉండాలి. అహంకరిస్తే ఎలా? లోకంకూడా అనుకోవద్దూ? జగత్తు శివునివిల్లు. జడంకాదు, జడం అనుకుంటే ప్రమాదం. శిక్షపడుతుంది. రాముడు సాత్త్విక మహాశక్తి సంపన్నుడు, ధర్మవీరుడు. విజయలక్ష్మి రాముణ్ణి వరిస్తుంది, జగత్తు రామునికే నతమస్తక మవుతుంది – ధర్మా నికే దాసోహ మంటుంది. యతో ధర్మస్తతో జయః – ధర్మం రాముడు, జయం సీత ధర్మాన్ని అంటి పెట్టుకుని జయంఉ ంటుంది. నీడలాగ, ఇదీ మన పరంపర,





