News

లేహ్‌లో అనలాగ్‌ మిషన్‌ను ప్రారంభించిన ఇస్రో

226views

భారత అంతరిక్ష సంస్థ-ఇస్రో తొలి అనలాగ్ స్పేస్ మిషన్‌ను లద్దాఖ్‌ లేహ్‌లో ప్రారంభించింది. హ్యూమన్‌ స్పేస్‌ ఫ్లైట్‌ సెంటర్‌, ఆకా స్పేస్‌ స్టూడియో, లడఖ్‌ విశ్వవిద్యాలయం, ఐఐటీ బాంబే, లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ సహకారంతో ఈ మిషన్‌ చేపట్టినట్లు తెలిపింది.

ఈ మిషన్‌లో భాగంగా లేహ్‌లో ఓ స్పేస్‌ సెంటర్ ను ఇస్రో సృష్టిస్తుంది. ఇతర గ్రహంలో పరిస్థితులు లాంటి వాతావరణాన్నే సృష్టించనున్నారు. భూమికి దూరంగా ఉన్న ప్రదేశాల్లోని బేస్‌ స్టేషన్లలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు కనుగొనేందుకు ఇస్రో చర్యలు చేపట్టింది.

ఇక్కడ వ్యోమగాములకు కూడా ఇక్కడ శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఉంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టనున్న మిషన్‌ గగన్‌యాన్‌ ను సులభతరం చేసేందుకు ఈ అనలాగ్ మిషన్ దోహద పడనుంది. లద్దాఖ్‌లోని వాతావరణ పరిస్థితులు కొంతమేర చంద్రుడు, మార్స్‌ పరిస్థితులను పోలి ఉంటాయి.

చల్లని, పొడి వాతావరణం తో పాటు ఎక్కువ ఎత్తు ఉండడంతో ఇక్కడి నుంచి దీర్ఘకాలిక అంతరిక్ష మిషన్ల కోసం సన్నాహాలకు ఉపయుక్తంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అనలాగ్‌ మిషన్‌లోని వారంతా ఇతర గ్రహాలు, స్పేస్‌షిప్‌ల్లో ఉండే పరిస్థితులు అనుభవిస్తారు. అంతరిక్ష యాత్రకు సబంధించి కూడా భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం కానున్నాయి.