News

తిరుమల ఆలయ పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలి : చంద్రబాబు

28views

తిరుమల ఆలయ పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో ఆయన సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ‘‘కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదు. ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదు. ఏ విషయంలోనూ రాజీ పడొద్దు. భవిష్యత్‌ నీటి అవసరాలకు ముందస్తు ప్రణాళిక చాలా అవసరం. అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80 శాతానికి పైగా పెంచాలి. అటవీ సంరక్షణ, అడవుల విస్తరణకు ప్రణాళికతో పని చేయాలి.

ప్రసాదాల నాణ్యత ఎల్లప్పుడూ కొనసాగాలి. మరింత మెరుగపడాలి. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలి. ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదు. ఆధ్మాత్మికత ఉట్టిపడేలా ఉండాలి.. ఆర్భాటం, అనవసర వ్యయం వద్దు. భక్తుల పట్ల తితిదే సిబ్బంది గౌరవంగా వ్యవహరించాలి. దేశవిదేశాల నుంచి ఇక్కడికి వచ్చేవారిని గౌరవించుకోవాలి. స్విమ్స్‌ సేవలు కూడా మెరుగుపడాలి’’ అని చంద్రబాబు తెలిపారు.

బయో డైవర్సిటీ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. తితిదే సేవలపై భక్తుల నుంచి స్పందన తీసుకునే విధానంపై ప్రశ్నించారు. ప్రతి భక్తుడు అభిప్రాయాలు చెప్పే అవకాశాలు కల్పించాలన్నారు. వారి సూచనల ఆధారంగా సేవలపై తితిదే పనిచేయాలని ఆదేశించారు. ఒక్క తితిదేలోనే కాకుండా అన్ని ఆలయాల్లో ఇది అనుసరించాలని ఆదేశించారు. అభిప్రాయాలు తీసుకునే విధానం తీసుకురావాలని మంత్రి ఆనంకు సీఎం సూచించారు. ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యత బాగుండేలా చూడాలని చెప్పారు.

తిరుమలలో రెండోరోజు చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. అత్యాధునిక వకుళామాత సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ను ఆయన ప్రారంభించారు. మంత్రి ఆనం కార్యక్రమంలో పాల్గొన్నారు.