News

ప్రజ్ఞాన్ రోవర్‌కు చిక్కిన భారీ పురాతన బిలం

22views

ప్రపంచ అంతరిక్ష చరిత్రలో భారత్ పేరును సువర్ణాక్షరాలతో లిఖించిన చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించి తాజాగా మరో కీలక విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు వెల్లడించారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన చంద్రయాన్ 3 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటికి వచ్చింది. ఇక విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయిన ప్రాంతాన్ని శివశక్తి పాయింట్‌గా కేంద్రం ప్రకటించింది.

ఈ క్రమంలోనే అక్కడ సమాచారాన్ని సేకరించిన ప్రజ్ఞాన్ రోవర్.. ఇస్రోకు పంపించింది. ఆ సమాచారాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు విశ్లేషించి.. కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటున్నారు. ఈ సమాచారం తర్వాత చేపట్టబోయే చంద్రయాన్ సిరీస్ ప్రయోగాలకు ఎంతో ఉపయోగం కానుందని పేర్కొన్నారు

అయితే ఈ చంద్రయాన్ 3 ప్రయోగంలోని ల్యాండర్, రోవర్.. జాబిల్లి దక్షిణ ధ్రువంపై శాశ్వత నిద్రలోకి జారుకున్నా అవి పంపించిన సమాచారం మాత్రం ఇస్రోకు చేరింది. ఈ క్రమంలోనే చంద్రుడి దక్షిణ ధ్రువంపై తిరిగి సమాచారాన్ని సేకరించిన ప్రజ్ఞాన్ రోవర్ ఆ శివశక్తి పాయింట్‌కు సమీపంలోనే ఓ భారీ క్రేటర్‌ను గుర్తించింది. 160 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఓ భారీ బిలం పురాతన కాలం నాటిది అని గుర్తించారు.

ఈ బిలానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రజ్ఞాన్ రోవర్‌కు బిగించిన హై రెజెల్యూషన్ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. వీటిని ఇస్రోకు రోవర్ పంపించింది. వీటికి సంబంధించిన వివరాలతో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉండే ఇస్రో అనుబంధ సంస్థ అయిన ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ శాస్త్రవేత్తలు రూపొందించిన నివేదికను సైన్స్ డైరెక్ట్ అనే జర్నల్‌ ప్రచురించింది.

జాబిల్లి దక్షిణ ధ్రువంపై ఉన్న అతి పెద్ద, పురాతనమైన ఐట్కెన్ బేసిన్ నుంచి దాదాపు 350 కిలోమీటర్ల దూరంలో 160 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఇంకో బిలం ఉందని తాజాగా ప్రజ్ఞాన్ రోవర్ గుర్తించిందని ఈ నివేదికలో పేర్కొన్నారు. చంద్రుడి ఉపరితలంపై ఉన్న అతి ప్రాచీన బిలాల్లో ఈ బిలం కూడా ఒకటి అని ఇస్రో శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఈ బిలంపై మరిన్ని పరిశోధనలు జరిపితే చంద్రుడి భౌగోళిక చరిత్రను తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.