News

చాముండి కొండలకు కొత్త సొబగులు

31views

కర్ణాటకలోని ప్రఖ్యాత చాముండేశ్వరి అమ్మవారి ఆలయం ఉన్న చాముండి కొండల మీద ధూమపానం, మద్యపానం, గుట్కా, కిళ్లీ వంటి వాటిని పూర్తిగా నిషేధించారు. త్వరలోనే ప్లాస్టిక్ నిషిద్ధ ప్రాంతంగా కూడా చేయనున్నారు. చాముండేశ్వరి ఆలయం లోపల ఫోటోగ్రఫీని కూడా నిషేధించారు. సెల్ఫోన్లను స్విచాఫ్ చేయవలసి ఉంటుంది. ఐదేళ్ల కాలపరిమితిలో ఆలయ అభివృద్ధికి ప్రణాళిక తయారు చేయవలసిందిగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారులను సెప్టెంబర్ 3న ఆదేశించారు. చాముండేశ్వరి క్షేత్ర అభివృద్ధి ఆధారిటి తొలి సమావేశం జరిగిన తరువాత ముఖ్యమంత్రి
ఈ విషయాలు తెలియచేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘ప్రసాద్’ పథకం (ఫిలిగ్రిమేజ్ రిజువనేషన్ అండ్ స్పిరుట్యువల్ అగ్మెంటేషన్ డ్రైవ్) చాముండి కొండల మీద ఐదు దేవాలయాల అభివృద్ధికి అదనంగా రూ. 11 కోట్లు విడుదల చేస్తామని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. అయితే ఒక మెలిక మాత్రం పెట్టారు. ఆలయ ప్రవేశానికి ప్రత్యేక దుస్తులంటే ఏమీ లేవనీ, అన్ని కులాలు వారు, మతాల వారు కూడా సందర్శించవచ్చునని ప్రకటించారు.

చాముండేశ్వరి ఆలయానికి వేయేళ్ల చరిత్ర ఉంది. ఒకనాడు చిన్న ఆలయమే అయినా, కాలక్రమంలో పెద్ద పుణ్యక్షేత్రంగా ఆవిర్భవించింది. క్రీస్తుశకం 1399లో వడయార్ వంశీకులు మైసూరు పాలకులు అయిన తరువాత ఎక్కువ అభివృద్ధి జరిగింది. దసరాలకు నిత్యం వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు కాబట్టి, వారి సౌకర్యాలు కోసం చాముండేశ్వరి క్షేత్ర అభివృద్ధి అధారిటీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయ్యాయి కూడా. ఈ కొండల మీద చాముండేశ్వరి అమ్మవారి ఆలయం కాకుండా, మరొక 24 ఆలయాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ ఆధారిటీ పరిధిలోకి తీసుకువచ్చారు.