ArticlesNews

ఆంధ్రజాతికి సంస్కరణల “వెలుగుజాడలు” చూపిన గురజాడ అప్పారావు

29views

( సెప్టెంబర్ 21 – గురజాడ అప్పారావు జయంతి )

ఆధునిక తెలుగు సాహిత్యాన్ని మేలిమలుపు తిప్పిన ఆధునికాంధ్ర వైతాళికుడు, అభ్యుదయ కవితా పితామహుడు, తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి. తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి, ఆధునిక వచన రచనకు ఆద్యుడు. దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్” అని మానవత్వానికి నాంది పలికి, ఒట్టిమాటలు కట్టి పెట్టి గట్టిమేల్ చేయమని ఆనాడే ఉధ్ఘాటించిన నవయుగ వైతాళికుడు సంఘ సంస్క‌ర్త‌, గురజాడ వెంకట అప్పారావు

గురజాడ వెంకట అప్పారావు 1862, సెప్టెంబర్ 21 న విశాఖజిల్లా రాయవరంలో వెంకట రామదాసు, కౌసల్యమ్మ దంపతులకు జన్మించారు. ప్రాధమిక విద్యను చీపురుపల్లిలో, మెట్రిక్యులేషన్ విజయనగరంలో చదువుకున్నారు. తర్వాత ఎఫ్. ఎ చేసారు. 1885లో అప్పల నరసమ్మగారిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలూ, ఒక కుమారుడు. పట్టభద్రులు కాకపూర్వమే విజయనగరం మహారాజ కళాశాలలో కొన్నాళ్ళు ఉపాద్యాయులుగా పనిచేశారు. ఉపాద్యాయులుగా పనిచేసే రోజుల్లోనే కవిత్వం వ్రాసి పత్రికల్లో ప్రచురిసుండేవారు.

ఆంధ్రావనిలో భాష, సామాజిక, సాహిత్యరంగాల్లో అత్యాధునిక, అభ్యుదయమార్గాన్ని చూపించి సంస్కరణలు చేపట్టి, సుసంపన్నం చేసిన త్రిమూర్తులలో కందుకూరి వీరేశలింగం, గిడుగు రామ్మూర్తితో పాటుగా గురజాడ వారు ఒకరు. ప్రజలందరికీ అర్ధమయ్యే జీవ భాషలో, ప్రయోజనాత్మక రచనలు చేసి గిడుగు రామ్మూర్తి వ్యవహారిక భాషోద్యమంలో తన వంతు కృషి చేశారు గురజాడ. కన్యాశుల్కం, పూర్ణమ్మ, ముత్యాల సరాలు, కన్యక, కొండుభట్టీయం, నీలగిరి పాటలు, లవణరాజు కల, దిద్దుబాటు వంటి ఆణిముత్యాలను అందించారు గురజాడ. గంగిగోవు పాలు గరిటడైనను చాలు అన్న రీతిలో రాశిలో తక్కువైనా, ఆయనవి వాసికెక్కిన రచనలు.

కన్యాశుల్కం నాటకంలో గురజాడ సృజించిన తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి… డామిట్‌! కథ అడ్డంగా తిరిగింది… వంటి వాక్యాలు వినని తెలుగు వారు వుండరు. బాల్యవివాహాలను, కన్యాశుల్కాన్ని, ఆనాటి సమాజపు రుగ్మతలను ఖండిస్తూ గురజాడ రాసిన తొలి తెలుగు ఆధునిక నాటకం కన్యాశుల్కం. కావ్యేషు నాటకం రమ్యం అన్న నానుడిని నిజం చేస్తూ అత్యంత ప్రాచుర్యం చెంది, ప్రజాదరణ పొందిన నాటకం కన్యాశుల్కం. ఈనాటకంలో గిరీశం, మధురవాణి, బుచ్చమ్మ, రామప్పంతులు వంటి పాత్రలు ఖ్యాతి పొందాయి. 1955లో కన్యాశుల్కం సినిమాగా వచ్చి జనానికి మరింత చేరువైంది. కన్యాశుల్కం నాటకం రచించి వందేళ్లకు పైబడినా జాతికి జీవగర్ర వంటి కన్యాశుల్కం నాటకం నేటికీ నిత్యనూతనం.

ఆంధ్రజాతి కంతటికీ సంస్కరణల గురుజాడలు చూపిన వెలుగుజాడ మన గురజాడ 1915 నవంబర్ 30 వ తేదీన కన్నుమూశారు. చారిత్రక ప్రశస్తి కలిగిన విజయనగరంలో గురజాడ నివసించిన ఇంటిని నేటికి మనం చూడవచ్చు. వ్యవస్థలో నిజమైన మార్పు కోసం అక్షర సమరం సాగించిన భాషాయోధుడు గురజాడ. సమాజానికి మేలు చేసేదే నిజమైన సాహిత్యమనే అభిప్రాయాన్ని అక్షరసత్యాలుగా నిరూపించి నూతన విజ్ఞానోదయకాంతులు ప్రసరింపజేసిన దీపశిఖ గురజాడ.