ArticlesNews

నక్సలైట్లపై తిరగబడ్డ వనవాసులు… ఢిల్లీలో నిరసన ప్రదర్శన

30views

కొన్ని సంవత్సరాలుగా నక్సల్స్ తో విసిగిపోతున్న బాధితులు వారిపై ఒక్కసారిగా తిరగబడ్డారు. వారి చేష్టలకు నిరసనగా నక్సల్స్ బాధితులు ఢిల్లీలో రోడ్డెక్కారు. ఈ నిరసన కార్యక్రమానికి అనేక మంది బాధితులు తరలివచ్చారు. ‘‘బస్తర్ శాంతి సమితి’’ ఆధ్వర్యంలో 50 మంది వనవాసీలు నిరసనకు దిగారు. ఢిల్లీ రోడ్లపై మౌన ప్రదర్శన నిర్వహించారు. ‘‘మావోయిస్టుల్లారా మా మాటలు వినాల్సిందే’’ అంటూ ప్లకార్డులతో ప్రదర్శనకు దిగారు. బస్తర్ లోని వనవాసీ క్షేత్రంలో నగ్జలైట్లు కొన్ని నెలలుగా స్థానికులను తీవ్రంగా హింసిస్తున్నారు. అంతేకాకుండా పాఠశాల విద్యార్థులు, సామాన్యులే టార్గెట్ గా హత్యలు చేస్తూ దారుణాలకు ఒడిగడుతున్నారు.

మావోయిస్టులు తమ ప్రాంతాల్లో వెంటనే హింసకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. అలాగే తాము మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్నామని, నగ్జలైట్ల కారణంగా తమ ప్రాంతాల పురోగతి తీవ్రంగా కుంటుపడుతోందని వనవాసీలు మండిపడ్డారు. అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించడమే కాకుండా తమ ప్రజలను ఇన్ఫార్మర్ల నెపంతో హత్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమ గోడు వినాలని, నగ్జలైట్లు తమ ప్రాంతంలో చేసిన అరాచకాలను రాష్ట్రపతికి నివేదిస్తామని తెలిపారు. ఈ విషయంపైనే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలుస్తామని ప్రతినిధులు ప్రకటించారు.

ఈ మేరకు ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. మావోయిస్టుల బారి నుంచి తమ మాతృభూమిని విముక్తం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే మావోయిస్టులు పెట్టిన బాధలను ఇప్పటికీ తమ వారు అనుభవిస్తున్నారని, ఘోరమైన హింసను వారు ప్రేరేపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మావోయిస్టుల చేతిలో ప్రాణాలను కోల్పోయిన వనవాసుల జాబితాను కూడా వారు విడుదల చేశారు. తమ కోసమే వున్నామంటూ తమను మావోయిస్టులు బుకాయిస్తున్నారని, తమ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఇంత జరుగుతున్నా… మావోయిస్టులు తమను హింసలు పెడుతున్నా… మానవ హక్కుల సంఘాలు తమ వైపు తొంగికూడా చూడటం లేదని మండిపడ్డారు.

మరోవైపు వీరు కేవలం ఆరోపణలు మాత్రమే చేయకుండా తగిన ఆధారాలను కూడా సమాజం ముందు వుంచారు. కమిటీ విడుదల చేసిన వివరాల ప్రకారం బీజాపూర్ జిల్లా కాచిల్వార్ గ్రామానికి చెందిన 18 ఏళ్ల గుడ్డురామ్ లేకం బయటికి వెళ్లి, తిరిగి వస్తుండగా మావోయిస్టులు బాంబు పేల్చారు. దీంతో ఓ కాలును పడగొట్టుకున్నారు.

2. బీజాపూర్ కి చెందిన 22 ఏళ్ల యువకుడు మద్వినందా నక్సలైట్లు అమర్చిన పేలుడు పదార్థాలు పేలడంతో కాలు పోగొట్టుకున్నాడు.

3. కర్తమ్ జగక్క (45) అనే మహిళ కూడా నక్సలైట్లు అమర్చిన పేలుడు పదార్థాలు పేలి, తీవ్రంగా గాయపడింది. ఈమెనే ఆ ఇంటికి జీవనాధారం. దీంతో ఆ కుటుంబం ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతోంది.

4. సుక్కి మడ్కమ్ (14). ఈమెది సుక్మా జిల్లా. మావోయిస్టుల పేలుడులో ఎడమ కాలును కోల్పోయింది.

ఇలా అనేక ఉదాహరణలు తమ ముందు వున్నాయని, వాటన్నింటినీ బయటికి తీస్తామని కమిటీ ప్రకటించింది. మరోవైపు ఈ కమిటీ అర్బన్ నక్సలైట్లపై కూడా విరుచుకుపడింది. వీరు కూడా తమకు తీవ్ర అన్యాయాన్ని చేస్తున్నారని, బూటకపు ఎన్ కౌంటర్లతో తమను చంపేస్తున్నారని వనవాసీలు మండిపడ్డారు. జర్నలిస్టులుగా, లాయర్లుగా, నిజ నిర్ధారణ కమిటీ పేరుతో, సినిమా నిర్మాతలంటూ తమ బస్తర్ ప్రాంతానికి చేరుకుంటారని, అన్నీ తెలుసుకుంటారు కానీ… తమకు న్యాయం మాత్రం చేయడం లేదని తీవ్రంగా ఆక్షేపించారు.