ArticlesNews

ఆలయాల స్వర్గం కంచి

32views

అయోధ్య, మథుర, హరిద్వార్‌ (మాయా), కాశీ, కంచి, ఉజ్జయిని (అవంతి), ద్వారక… ఈ ఏడు ప్రదేశాల్లోని పుణ్యక్షేత్రాలు ముక్తినిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. వీటిలో ఆరు ఉత్తరాదిన, ఒక్క కాంచీపురం దక్షిణ భారతంలో ఉన్నాయి. పల్లవుల రాజధాని అయిన కాంచీపురంలో కామాక్షి, ఏకామ్రేశ్వరస్వామి, వరదరాజస్వామి, కచ్ఛపేశ్వర, కైలాసనాథ స్వామి లాంటి పురాతన దేవాలయాలెన్నో కనిపిస్తాయి. వీటిలో కొన్ని పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్నాయి. ఈ ఆలయాల శిల్ప కళ అద్భుతంగా ఉంటుంది. ఈ నగరాన్ని శివకంచి, విష్ణుకంచి అని రెండు భాగాలుగా పిలుస్తారు.

ఇక్కడి ఆలయాలను దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు, యాత్రికులు వస్తుంటారు. ఏడాది పొడవునా ఈ ఆలయాల్లో నిర్వహించే ఉత్సవాల్లో శివపార్వతుల కల్యాణమైన పంగుని ఉత్తరం(మార్చి నెల), వైకుంఠ ఏకాదశి, కంచి గరుడసేవ ప్రధానమైనవి. నలభై ఏళ్లకు ఒకసారి అత్తి వరదరాజస్వామిని నీటిలో నుంచి బయటకు తీసి కొద్ది రోజుల పాటు భక్తుల దర్శనానికి అవకాశం కల్పిస్తారు. 2019లో ఈ ఉత్సవం జరిగింది. శంకర భగవత్పాదులు స్థాపించిన కంచి కామకోటి పీఠం, అందులో దశాబ్దాలపాటు పూజలు నిర్వహించిన పరమ పూజ్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ పరమాచార్య బృందావనం, వారి మైనపు విగ్రహం దర్శించుకుని భక్తులు పరమానందభరితులవుతారు.