News

బంగ్లాదేశ్‌లో హిందువుల నరమేధం: ఇస్కాన్ చీఫ్‌తో విహెచ్‌పి అధ్యక్షుడి భేటీ

34views

పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో హిందువుల నరమేధంలో భాగంగా ముస్లిములు హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఏళ్ళ తరబడి బంగ్లాదేశీ ముస్లిములకు ఆహారం పెట్టిన ఇస్కాన్ దేవాలయాలను ముస్లిం మతఛాందస ముష్కరులు నేలమట్టం చేసారు. ఆ నేపథ్యంలో విశ్వహిందూ పరిషద్ అధ్యక్షుడు అలోక్‌ కుమార్ ఇస్కాన్ చీఫ్ మోహన్‌రూప్‌ దాస్‌ ప్రభుతో సమావేశమయ్యారు. వారికి హిందూ సమాజం తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

విహెచ్‌పి అధ్యక్షుడు అలోక్ కుమార్ దక్షిణ ఢిల్లీలోని కైలాష్ ప్రాంతంలో ఉన్న ఇస్కాన్ మందిరానికి మంగళవారం వెళ్ళారు. ఆ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్ దేవాలయాలు సహా గుడులపై దారుణమైన దాడులు చేయడాన్ని ఆయన ఖండించారు. బాధితులకు సహానుభూతి ప్రకటించారు. ఇస్కాన్ ఆలయాలు, భక్తులపై జిహాదీలు దాడులు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2021లో కూడా ఇటువంటి దాడే ఇస్కాన్ సంస్థ మీద జరిగింది. అయినప్పటికీ ధర్మం కోసం ఇస్కాన్ బ్రహ్మచారులు, భక్తులు అంకితభావంతో భక్తితో పనిచేస్తుండడాన్ని కొనియాడారు.

ఇటీవల జరిగిన ఘర్షణల్లో దెబ్బతిన్న హిందూ దేవాలయాలు, మందిరాలు, ఆశ్రమాలు, భక్తులకు బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం భద్రత కల్పించాలని, పరిహారం చెల్లించాలనీ విశ్వహిందూ పరిషద్ డిమాండ్ చేసింది. అలాగే అతివాదులపై కఠినమైన చర్యలు చట్టపరంగా తీసుకోవాలని కోరింది. అటువంటి జిహాదీ కార్యకలాపాలు, మతహింస ఘటనలు మళ్ళీ జరగకుండా నిలువరించేందుకు భారత ప్రభుత్వం, ప్రపంచవ్యాప్త మానవ హక్కుల సంస్థలు కృషి చేయాలని అలోక్ కుమార్ కోరారు.

ఈ సంక్షోభ సమయంలో విశ్వహిందూ పరిషద్‌తో పాటు మొత్తం హిందూ సమాజం ఇస్కాన్‌కు హృదయపూర్వకంగా అండగా నిలుస్తుందని, ఎలాంటి అవసరమున్నా కలిసి పనిచేస్తామనీ విహెచ్‌పి అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్, ఇస్కాన్ ప్రతినిధులకు భరోసా ఇచ్చారు.

ఆ సమావేశంలో విహెచ్‌పి జాతీయ ప్రతినిధి వినోద్ బన్సల్, ప్రాంత ధర్మాచార్య సంపర్క్ ప్రముఖ్ దీపక్ గుప్తా, సహ ప్రముఖ్ లక్ష్మణ్ సింగ్, ఇతర విహెచ్‌పి బజరంగ్‌దళ్ నాయకులు పాల్గొన్నారు.