News

ఇల వైకుంఠపురంలో… వ్యాస ధర్మ క్షేత్రం

48views

అనంతమైన వేదరాశిని నాలుగు వేదాలుగా విభజించి, పంచమ వేదమైన మహాభారతాన్నీ, శ్రీమద్భాగవతాన్నీ, అష్టాదశ పురాణాలనూ లోకానికి అందించిన మహనీయుడు, ప్రాతఃస్మరణీయుడు వ్యాస భగవానుడు.

సాక్షాత్తూ శ్రీమన్నారాయణ స్వరూపుడైన ఆ మహా గురువు కృష్ణానదీ తీరంలోని వైకుంఠపురంలో పూజలందుకుంటున్నాడు.

ధర్మ మార్గాన్ని ప్రబోధించి, భారతీయ సంస్కృతి సంప్రదాయాల సారాన్నంతటినీ వాఙ్మయంగా అందించిన వేదవ్యాసుడి విశిష్టతను తరతరాలకు తెలియజెయ్యాలన్న సంకల్పంతో… శ్రీ భవఘ్ని గురుదేవుల సంకల్పం మేరకు ఆవిష్కృతమైన మందిరం… భగవాన్‌ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మ క్షేత్రం. పల్నాడు జిల్లా వైకుంఠపురం గ్రామంలో, ఉత్తరవాహినిగా ప్రవహించే కృష్ణానదీ తీరంలో, క్రౌంచగిరి సమీపాన ఈ ఆలయ నిర్మాణం జరిగింది. యాభై వేల అడుగుల విస్తీర్ణంలో, మూడు అంతస్తుల్లో, చోళ శిల్పకళారీతిలో ఈ ఆలయం రూపుదిద్దుకుంది. భవఘ్ని ఆరామం ఎదురుగా, పచ్చటి పంట చేల మధ్య ఉండే ఈ ఆలయ వాతావరణం సందర్శకులకు ఆహ్లాదం కలిగిస్తుంది.

పద్ధెనిమిది మెట్లు… నాలుగు స్తంభాలు..
ఈ క్షేత్రంలో అడుగుపెట్టిన వెంటనే పవిత్ర తులసీవనం, తరువాత బదరికావనం, అశ్వత్థ వృక్షం స్వాగతం పలుకుతాయి. వ్యాస భగవానుడు బదరికావనంలో తపస్సు చేసి, బాదరాయణుడయ్యారు. దాన్ని గుర్తు చేసేలా బదరికావనాన్ని ఏర్పాటు చేశారు. క్షేత్ర ప్రవేశ మార్గంలోని పద్ధెనిమిద మెట్లు అష్టాదశ పురాణాలకు, భగవద్గీతలోని అష్టాదశ యోగాలకూ ప్రతీక. పక్కనే ఉన్న నాలుగు స్తంభాలు సత్యం, ధర్మం, శాంతి, ప్రేమలను ప్రతిబింబిస్తాయి. క్షేత్ర ప్రాంగణం నుంచి దిగువకు మెట్ల మార్గంలో వెళ్తే… శిష్యులకు జ్ఞాన బోధ చేస్తున్న వ్యాస భగవానుడి విగ్రహం సమున్నతంగా కనిపిస్తుంది. వ్యాసునితో పాటు ఆయన ప్రధాన శిష్యులైన పైలుడు, సుమంతుడు, వైశంపాయనుడు, జైమిని, శుకుడు, సూత మహామనుల విగ్రహాలను కూడా చూడవచ్చు. ఆ శిష్యుల ద్వారానే చతుర్వేదాలను, భారత, భాగవత, అష్టాదశ పురాణాలను లోకానికి వ్యాసుడు అందించాడు. మహాభారతంలో వ్యాసుడు.. కురు వంశస్థుల ఇబ్బందులను దూరం చేయడం, ధర్మబోధ చేయడం లాంటి సందర్భాలు కనిపిస్తాయి. ఆ సన్నివేశాలు గోడలపై చిత్ర రూపంలో ఉంటాయి. అలాగే, వ్యాసుడి జీవితం తదితర అంశాలను వివిధ భాషల్లో వీక్షించడానికి వీలుగా ఆడియో విజువల్‌ థియేటర్‌ ఏర్పాటు చేశారు.

గ్రంథాల కొలువు… సత్సంగాలకు నెలవు
దేవాలయాల్లో గ్రంథాలయాలు ఉండడం అరుదు. ఈ వేద వ్యాసుని ఆలయంలో వ్యాస విరచితమైన పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలతో సహా అనేక ప్రామాణిక గ్రంథాలతో ఒక గ్రంథాలయం ఉంది. అదే విధంగా… ప్రతి ఆదివారం, గురుపౌర్ణమి, గీతా జయంతి లాంటి పర్వ దినాల్లో పూజ్యశ్రీ గురుదేవుల సత్సంగాన్ని. అనుగ్రహ భాషణాలను వినడం కోసం 750మంది కూర్చోవడానికి అనువుగా విశాలమైన సత్సంగ మందిరం నిర్మించారు. అక్షర స్వరూపుడైన వ్యాసుని సమక్షంలో చిన్నారులకు అక్షరాభ్యాసాలు కూడా ఈ క్షేత్రంలో జరుగుతాయి. సత్సంగ మందిరం పై అంతస్తులోని ప్రేమ మందిరంలో… కృష్ణ శిలతో తయారు చేసిన తొమ్మిది అడుగుల వ్యాసుని విగ్రహం… చిరునవ్వుతో, చిన్ముద్రలో, కరుణాపూరితమైన వీక్షణతో కనిపిస్తుంది. ఈ మందిరంలో 351 మంది కూర్చొనే వసతి ఉంది. ఈ మందిరానికి పై భాగంలోని పరంజ్యోతి మందిరంలో… వ్యాస వాఙ్మయ సారాంశమైన ‘సత్యం, ధర్మం, శాంతి ప్రేమ’లకు చిహ్నాలుగా నాలుగు స్తంభాలు ఉన్నాయి. వాటి మధ్యలో ఉన్న జ్యోతి మందిరంలో… తొమ్మిది మెట్లపై అఖండ జ్యోతి దర్శనమిస్తుంది. ఇందులో ఎనిమిది మెట్లు అష్ట ప్రకృతులకు (పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం) సంకేతం కాగా, తొమ్మిదో మెట్టు జీవాత్మ, పైన ఉన్న అఖండ జ్యోతి పరమాత్మ. చుట్టూ ఉన్న మందిరం మానవ దేహానికి ప్రతీక. మానవుడు సాధన ద్వారా, గురు కృపతో సత్యాన్ని తెలుసుకొని, అంతర్ముఖుడై, అఖండమైన ఆత్మజ్యోతిని దర్శించుకోవాలన్నదే దీనివెనుక ఉద్దేశం.

ఇంటికో ఇటుక…
అఖండ జ్యోతి మందిరం ఎదురుగా ఉన్న నిర్వికల్ప ధ్యాన మందిరంలో… వ్యాసుని విగ్రహం ముందు కూర్చొని, 54 మంది ఒకేసారి ధ్యానం చేసుకోవచ్చు. నిర్వికల్ప మందిరం ఎదుట పసిడి వర్ణంలో, 45 అడుగుల ఎత్తులో, అందమైన శిల్పాలతో శిఖరం దర్శనమిస్తుంది. శిఖరంతో కలిసి మొత్తం సనాతన ధర్మ క్షేత్రం ఎత్తు 108 అడుగులు. ఈ క్షేత్ర నిర్మాణంలో పేద, ధనిక తారతమ్యం లేకుండా అందరినీ భాగస్వాములను చేశారు. ఇంటికో ఇటుక చొప్పున దాదాపు లక్షన్నర ఇటుకలను సేకరించారు. వాటికి పూజలు చేసి, ఆలయ నిర్మాణానికి వినియోగించారు. విదేశాల్లో నివసిస్తున్న అనేకమంది భారతీయులు సైతం ఇతోధికంగా సాయం అందించారు. పవిత్ర నదీ తీరాల నుంచి ఇసుకను, జలాలను సేకరించి, ధర్మ క్షేత్ర నిర్మాణంలో వాడారు. 2002 మే నెలలో బింబ ప్రతిష్ఠ, 2023 జనవరి 28 నుంచి ఫిబ్రవరి ఒకటి వరకూ పూర్ణ ప్రతిష్ఠా మహోత్సవాలూ జరిగాయి. విజయవాడ నుంచి అమరావతి మధ్య ఉన్న వైకుంఠపురంలోని శ్రీ వేదవ్యాస సనాతన ధర్మ క్షేత్రానికి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.