News

మథుర వివాదంపై సుప్రీంలో హిందూ కక్షిదారుల కేవియట్

42views

ఉత్తర్ప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం మధురకు చెందిన కృష్ణ జన్మ భూమి – షాహీ ఈద్గా వివాదంపై హిందూ కక్షిదారులు సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషను దాఖలు చేశారు. ఈ వివాదానికి సంబంధించి హిందూపక్షం వేసిన 18 పిటిషన్ల నిర్వహణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు వాటికి విచారణార్హత ఉందంటూ ఆగస్టు 1న స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ముస్లిం సమాజం సర్వోన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నందున హిందూ వర్గీయులు ముందస్తుగా కేవియట్ దాఖలు చేశారు. న్యాయవాది విష్ణుశంకర్ జైన్ ద్వారా వేసిన ఈ పిటిషనులో తగిన విచారణ లేకుండా తమకు వ్యతిరేకంగా ఎటువంటి ఏకపక్ష ఆదేశాలు జారీ చేయవద్దని హిందూపక్షం కోర్టును కోరింది. మధురలో ప్రస్తుతం ఈద్గా ఉన్నచోట గతంలో మందిరం ఉండేదని, ఔరంగజేబు హయాంలో మందిరాన్ని పడగొట్టి ఈద్గా మసీదు కట్టారని హిందూ వర్గం వాదిస్తోంది. అలహాబాద్ హైకోర్టులో ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 12న జరగనుంది.