News

పాకిస్తానీ హిప్‌హాప్‌ ద్వయానికి ఎదురు దెబ్బ.. జాతీయవాదుల నుండి వ్యతిరేకత రావడంతో ఈవెంట్ రద్దు

61views

పాకిస్తానీ హిప్‌హాప్‌ ద్వయం ‘‘యంగ్‌ స్టన్నర్స్‌’’ కి ఎదురు దెబ్బ తగిలింది. డిసెంబర్‌ 13 నుంచి 25 వరకూ బెంగళూరుతో సహా ముంబై, డిల్లీ మహా నగరాల్లో ‘‘స్కిల్‌ బాక్స్‌’’ ఆధ్వర్యంలో వారి కార్యక్రమాలు ఫిక్స్‌ అయ్యాయి. అయితే.. గతంలో హిప్‌హప్‌ ద్వయంగా పిలవబడే యంగ్‌ స్టన్నర్స్‌ తల్హా అంజుమ్‌, తల్హా యూనుస్‌ భారత పరాక్రమ సైనికుడు అభినందన్‌ వర్ధమాన్‌ను కించపరిచారు. అలాగే కశ్మీరీ వేర్పాటువాదాన్ని సమర్థించారు. వీటితో పాటు భారత వ్యతిరేక విధానాలను, మోదీ వ్యతిరేక విధానాలను బాగా ప్రోత్సహిస్తూ సోషల్‌ మీడియాలో తెగ పోస్టులు పెట్టారు.

ఇప్పుడు మన దేశంలోని జాతీయవాదులు, దేశభక్తులు ఆ ట్వీట్లను గుర్తు చేసుకుంటూ.. అసలు వారి కార్యక్రమాలను ఎలా నిర్వహిస్తారు? ఎలా అనుమతిని అడుగుతున్నారు? అంటూ సోషల్‌ మీడియా వేదికగా నిర్వాహకులను ఏకిపారేశారు. దేశభక్తులందరూ సోషల్‌ మీడియా వేదికగా ఈ కార్యక్రమ నిర్వాహకులను నిలదీయడంతో దెబ్బకు… ఈ యంగ్‌ స్టన్నర్స్‌ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. కార్యక్రమ జాబితా నుంచి యంగ్‌ స్టన్నర్స్‌ పేరును తొలగిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో జాతీయవాదులు భారీ విజయం సాధించినట్లైంది.

నిజానికి స్కిల్‌ బాక్స్‌ ప్రకటించిన ప్రకారం ‘‘డిసెంబర్‌ 13 నుంచి 25 వరకూ యంగ్‌ స్టన్నర్స్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మంచి అనుభవం కోసం మాతో కలిసి రండి. భారత పర్యటనను విజయవంతం చేయండి. మూడు మహా నగరాల్లో నిర్వహిస్తున్నాం. అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మాట ఇస్తున్నాం’’ అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఎప్పుడైతే ఈ కార్యక్రమ షెడ్యూల్‌ బయటికి వచ్చిందో సోషల్‌ మీడియా వేదికగా తీవ్రమైన వ్యతిరేకత ప్రారంభమైంది. వీరుడు అభినందన్‌ వర్ధమాన్‌ను ఎగతాళి చేస్తూ తల్హా అంజుమ్‌ చేసిన ట్వీట్లను ఉటంకించారు. అలాగే తల్హా అంజుమ్‌ భారత వ్యతిరేక భావాలను కూడా ప్రచారం చేశారని, కశ్మీర్‌ వేర్పాటు వాదాన్ని సమర్థించారని జాతీయవాదులు గతాన్ని ఉటంకించారు. దేశభక్తి గేయమైన ‘‘ఆవో బచ్చో తుమ్హే దిఖాయే రaాన్‌కీ హిందుస్థాన్‌కీ’’ అన్న దానిని భారత వ్యతిరేక పాప్‌ స్టార్‌ ‘‘ఆవో బచ్చో సెర్‌ కరౌన్‌ మైనో తుమ్‌కో పాకిస్తాన్‌కీ, జిస్కీ ఖతీర్‌ లాలలాలా హిందూస్థాన్‌కీ’’ అంటూ పాకిస్తాన్‌కి మద్దతుగా రాశాడు. దీనిని జాతీయవాదులు ఉటంకించారు.

‘‘అసలు తల్హా ఎవడు? కశ్మీర్‌ విషయంలో భారత దేశ ఆలోచనా ధోరణికి బద్ధ విరోధి. పూర్తి వ్యతిరేక భావాలున్న వ్యక్తి. అలాగే ప్రధాని మోదీపై విషం చిమ్మిన వ్యక్తి. అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన భారత జవాన్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను ఎగతాళి చేసినవాడు. అలాంటి వ్యక్తికి సంబంధించిన షో కి టిక్కెట్లు బుక్‌ చేస్తారా? అసలు అనుమతి ఇవ్వడమే సిగ్గుచేటు’’ అంటూ ఓ జాతీయవాది ట్విట్టర్‌లో దుమ్మెత్తిపోశాడు.

మరో జాతీయవాది కూడా తీవ్రంగానే స్పందించాడు. ‘‘భారత వ్యతిరేకులు, భారతీయతను, మోదీని, కశ్మీర్‌ ను నిత్యం వ్యతిరేకించే పాకిస్తానీ రాపర్‌ తల్హా అంజుమ్‌ భారత్‌కి వస్తున్నాడు. ముంబైతో సహా ప్రధాన నగరాల్లో కార్యక్రమాలున్నాయి. వారిని భారత్‌లోకి రానిద్దామా? అంటూ ట్వీట్‌ చేశాడు.
మరో వైపు భారత్‌లో వారి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకు వచ్చిన స్కిల్‌ బాక్స్‌ స్పందించింది. ప్రజల మనోభావాలను తాము కచ్చితంగా పరిగణనలోకి తీసుకొంటామని, వారి పేర్లను జాబితా నుంచి తొలగించామని స్కిల్‌ బాక్స్‌ సీఈవో అన్‌మోల్‌ కుక్రేజా ప్రకటించారు.
అయితే.. స్కిల్‌ బాక్స్‌ ఈ నిర్ణయం తీసుకున్నా.. దేశీ డిస్కో వారు మాత్రం ఇప్పటికీ తాము భారత్‌లో కార్యక్రమం నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొంది. ఇప్పటికీ వారి పాక్‌ వెబ్‌సైట్‌లో ఈ కార్యక్రమం భారత్‌లో వుందనే చూపిస్తున్నారు.