ArticlesNews

పాకిస్తాన్‌కో, గల్ఫ్‌కో పొండి: శరణార్థులకు చెప్పింది ఎవరో తెలుసా….

57views

యెమెన్ నుంచి ఒక కుటుంబం భారత్‌లోకి అక్రమంగా చొరబడింది. ఆ కుటుంబాన్ని పాకిస్తాన్‌కో లేక గల్ఫ్ దేశాలకో వెళ్ళిపోవాలని బొంబాయి హైకోర్టు సలహా ఇచ్చింది. భారతదేశంలో ఆశ్రయం ఇవ్వాలన్న ఆ కుటుంబం పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. భారతదేశపు ఉదార స్వభావాన్ని అవకాశంగా తీసుకోవద్దని హెచ్చరించింది.

ఖలీద్ గొమాయ్ మొహమ్మద్ హసన్ అనే యెమెన్ జాతీయుడు తన భార్య, కుమార్తెతో దశాబ్ద కాలం క్రితం భారతదేశానికి వచ్చాడు. అతని వీసా గడుపు పూర్తయిపోయిన తర్వాత కూడా ఇక్కడే ఉండిపోయాడు. కొన్నేళ్ళుగా అతను భారత్‌లోనే స్థిరపడిపోయాడు.

పుణే పోలీసులు ఖలీద్ గొమాయ్ మొహమ్మద్ హసన్‌కు దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవాలని నోటీసులు జారీ చేసారు. ఆ ఉత్తర్వులపై అతను బొంబాయి హైకోర్టులో కేసు వేసాడు. ఆ కేసును జస్టిస్ రేవతీ మోహితే దేరే, జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ జులై 31న విచారణకు స్వీకరించింది. ఆ విచారణ సందర్భంలోనే ‘‘నువ్వు పక్కనే ఉన్న పాకిస్తాన్‌కో లేక ఏదైనా గల్ఫ్ దేశానికో వెళ్ళిపోవచ్చు. భారతదేశపు ఉదార వైఖరిని అవకాశంగా తీసుకుని దుర్వినియోగం చేయవద్దు’’ అని వ్యాఖ్యానించింది.

హసన్ తాను ఒక శరణార్థినని, తనకు ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషన్ (యుఎన్‌హెచ్‌సిఆర్) ఇచ్చిన రెఫ్యూజీ కార్డు ఉందని వాదించాడు. తనను దేశం నుంచి పంపించేయడం భారత రాజ్యాంగాన్నీ, ఐక్యరాజ్యసమితి నిబంధనలనూ ఉల్లంఘించడమే అంటూ వాదించాడు. పైగా తను ఆస్ట్రేలియా వెళ్ళాలనుకుంటున్నందున ఆ మేరకు తనకు వెసులుబాటు కల్పించాలని కోరాడు.

అయితే కోర్టు పిటిషనర్‌ వాదనతో ఏకీభవించలేదు. భారతదేశం తమపట్ల ఉదారంగా వ్యవహరిస్తుంటే, దాన్ని అవకాశంగా తీసుకోవద్దని హెచ్చరించింది. పొరుగునే ఉన్న పాకిస్తాన్‌లోనో లేక ఏదైనా గల్ఫ్ దేశంలోనో ఆశ్రయం తీసుకునే అవకాశం ఉందని గుర్తు చేసింది.

ఖలీద్ హసన్ తన పిటిషన్‌లో తాను పదేళ్ళ నుంచీ భారత్‌లోనే ఉంటున్నానని చెప్పాడు. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన విపత్కర పరిణామాలను యెమెన్ ఎదుర్కొంటోంది. ఆ సంక్షోభం కారణంగా తాను స్వదేశాన్ని విడిచిపెట్టాల్సి వచ్చిందని చెప్పాడు. అక్కడ కొన్నేళ్ళుగా నిరంతరాయంగా జరుగుతున్న అంతర్యుద్ధం కారణంగా 45లక్షల మంది ప్రజలు ఆ దేశాన్ని వదిలిపెట్టి పోయారని వివరించాడు.

‘‘నన్నూ నా కుటుంబాన్నీ బలవంతంగా యెమెన్ పంపించివేస్తే నా కుటుంబంలోని అందరి ప్రాణాలకూ ముప్పు వాటిల్లే ప్రమాదముంది. ఈ దేశం నుంచి నన్ను బహిష్కరించడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం, భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే, అన్నిటికీ మించి కనీస మానవ హక్కులను అతిక్రమించడమే’’ అని వాదించాడు.

హసన్ 2014 మార్చిలో విద్యార్ధి వీసా మీద భారత్ వచ్చాడు. అతని భార్య మెడికల్ వీసా మీద 2015 మేలో వచ్చింది. అతని వీసా గడువు 2017 ఫిబ్రవరిలోనూ, ఆమె వీసా గడువు 2015 సెప్టెంబర్‌లోనూ ముగిసిపోయాయి.

ఖలీద్ హసన్ కుటుంబానికి పుణే పోలీసులు ఈ యేడాది ఫిబ్రవరిలో మొదటిసారి, ఏప్రిల్‌లో రెండోసారీ నోటీసులు జారీ చేసారు. ఆ నోటీసులు అందిన 14 రోజులలోగా దేశం వదిలిపెట్టిపోవాలని చెప్పారు.

అయితే తమకు ఆస్ట్రేలియా వీసా వచ్చేవరకూ భారత్‌లోనే ఉండనివ్వాలంటూ పిటిషనర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

వారి వాదనను కోర్టు ఒప్పుకోలేదు. పిటిషనర్ భారత్ కాకుండా మరో 129 దేశాలకు వెళ్ళవచ్చునన్న పుణే పోలీస్ వాదనతో ఏకీభవించింది. దానికి ఒప్పుకోని పిటిషనర్లు, పోలీస్ చర్యల నుంచి రక్షణ కల్పించమని న్యాయస్థానాన్ని డిమాండ్ చేసారు. పదిహేను రోజులకు మించి రక్షణ కల్పించలేమనీ కోర్టు ఖరాఖండీగా తేల్చేసింది. ఆలోగా ఆస్ట్రేలియా వీసా తతంగాన్ని పూర్తి చేసుకోవాలని సూచించింది.

యెమెన్ దంపతులకు పుట్టిన కూతురి పరిస్థితి ఏమిటని న్యాయస్థానం పోలీసుల తరఫు అడ్వొకేట్‌ను ప్రశ్నించింది. భారత భూభాగంలో పుట్టినప్పటికీ ఆ సంతానం తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు భారతీయులైతేనే ఆ బిడ్డకు భారత పౌరసత్వం వస్తుందని అడ్వొకేట్ వివరించారు. ఈ కేసులో తల్లిదండ్రులిద్దరూ యెమెన్ జాతీయులు కాబట్టి వారి బిడ్డకు భారత పౌరసత్వం రాదని చెప్పారు.

ఆ విషయంపై మరింత సమాచారం సమర్పించాలని న్యాయవాదిని కోర్టు కోరింది. ఈ వ్యవహారంపై విచారణను తదుపరి వారానికి వాయిదా వేసింది.