News

శ్రీరాముడిపై తమిళనాడు మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

47views

శ్రీరాముడిపై తమిళనాడు మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు రాముని ఉనికిని చాటే ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని డీఎంకే మంత్రి ఎస్‌ఎస్‌ శివశంకర్‌ వ్యాఖ్యానించారు. అరియలూర్‌ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో శివశంకర్ మాట్లాడుతూ.. రాముడికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు.

చోళ రాజ వంశానికి చెందిన రాజేంద్ర-I వారసత్వాన్ని జరుపుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని తెలిపారు. రాజేంద్ర చోళన్‌ జీవించాడని చూపించడానికి ఆయన నిర్మించిన చెరువులు, ఆలయాలు ఉన్నాయి. అతని పేరు స్క్రిప్ట్‌లలో ప్రస్తావించారు. అతని శిల్పాలు ఉన్నాయి. కానీ రాముడు ఉన్నాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు, చరిత్ర లేదు. రామడిని అవతార్‌ అని పిలుస్తారు. అవతార్‌ పుట్టదు. మనల్ని మభ్యపెట్టేందుకు ఇలా చేస్తారు. మన చరిత్రను దాచి మరో చరిత్రను పెద్దగా చూపించే ప్రయత్నమిది.

అయితే డీఎంకే మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా దుమారాన్ని రేపాయి. దీనిపై బీజేపీ ఘాటుగా బదులిచ్చింది. ఈ మేరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై డిఎంకేపై మండిపడ్డారు.

భగవంతుడు శ్రీరాముడిపై డీఎంకేకు ఉన్న ఆస్మిక అభిమానం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. డీఎంకే నేతల జ్ఞాపకాలు ఇంత త్వరగా మసకబారుతున్నాయని ఎవరనుకుంటారు. వీరే కదా కొత్త పార్లమెంట్ కాంప్లెక్స్‌లో చోళ రాజవంశం సెంగోల్‌ను ఏర్పాటు చేసినందుకు ప్రధాని మోదీని వ్యతిరేకించిన వారు? తమిళనాడు చరిత్ర 1967లో ప్రారంభమైందని భావించే డీఎంకే పార్టీ అకస్మాత్తుగా దేశ గొప్ప సంస్కృతి చరిత్రపై ప్రేమను చూపడం హాస్యాస్పదంగా ఉంది.

రాముడిని ద్రావిడ మోడల్‌కు ఆద్యుడుగా పేర్కొన్న మరో మంత్రి రేగుపతిని ప్రస్తావిస్తూ.. తన సహోద్యోగితో (శివశంకర్‌) చర్చించి రాముడిపై ఏకాభిప్రాయానికి రావాలని అన్నామలై కోరారు. భగవంతుడైన రాముడి గురించి కొన్ని విషయాలు తన సహచర మంత్రి నుంచి శివశంకర్‌ నేర్చుకోగలరనే నమ్మకం ఉన్నట్లు చెప్పారు.