News

మంత్రం పఠించాడు.. మెడల్ సాధించాడు…

57views

ఈతరం కుర్రాళ్లు, స్టార్‌ ఆటగాళ్లు ఒంటిపై టాటూస్‌ ముద్రించుకుంటే వాటిపై ఏం రాసి ఉంటుంది? తమకు ఆత్మీయులైన వారి పేర్లు గానీ ఆసక్తికర పంచింగ్‌ లైన్‌లు గానీ ఎక్కువగా కనిపిస్తాయి. ఎక్కడో ఒక చోట దేవుడి బొమ్మలు కూడా ఉంటాయి. స్వప్నిల్‌ కుసాలే తన వెన్నెముక భాగం మొత్తం ‘మహా మృత్యుంజయ మంత్రం’ ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ ను టాటూగా ముద్రించుకున్నాడు. మానసికంగా తనకు కావాల్సిన బలాన్ని, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా చలించని దృఢత్వాన్ని ఆ రుగ్వేద మంత్రం తనకు ఇస్తుందని అతను బలంగా నమ్ముతాడు. అందుకే కావచ్చు సుదీర్ఘకాలం పాటు షూటింగ్‌ సర్క్యూట్‌లో ఉంటూ గొప్ప ఫలితాలు రాకపోయినా అతను ఎప్పుడూ స్థైర్యాన్ని కోల్పోలేదు.

నిజంగా కూడా కుసాలే కెరీర్‌ను చూస్తే చాలా ఆలస్యంగా గుర్తింపు వచ్చినట్లుగా కనిపిస్తుంది. 14 ఏళ్ల వయసులో షూటింగ్‌ను కెరీర్‌ను ఎంచుకున్న స్వప్నిల్‌ మూడేళ్ల తర్వాత తన తొలి అంతర్జాతీయ పోటీలో బరిలోకి దిగాడు. కానీ అతను తొలి ఒలింపిక్స్‌ ఆడేందుకు 12 సంవత్సరాలు పట్టింది. 2016 రియో ఒలింపిక్స్‌ సమయంలో అతని పేరు కనీసం పరిశీలనలో కూడా లేకపోగా… 2020 టోక్యో ఒలింపిక్స్‌కు కొన్నాళ్ల ముందు చెప్పుకోదగ్గ ప్రదర్శన లేకపోవడంతో టీమ్‌లోకి ఎంపిక చేయలేదు.

అయితే స్వప్నిల్‌ సుదీర్ఘ కాలం పాటు తన ఆటనే నమ్ముకున్నాడు. అవకాశం వ చ్చిన ప్రతీసారి విజయాన్ని అందుకుంటూ తనేంటో నిరూపించుకుంటూనే వచ్చాడు. ఎట్టకేలకు ఈసారి 28 ఏళ్ల వయసులో అతను మొదటిసారి ఒలింపిక్స్‌ బరిలోకి దిగడమే కాకుండా కాంస్యంతో చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడు.