ArticlesNews

రారండోయ్‌.. అంజన్న వైభవం చూద్దాం..

70views

శ్రావణ మాసం అంటే ఆంజనేయుడికి ఎంతో ప్రీతికరం. అలాగే ఆ స్వామి భక్తులకు ఈనెల అంటే ఎంతో ఇష్టం. ఆయన గుళ్లు ప్రత్యేక అలంకరణకు నోచుకుంటాయి. ఎక్కడ చూసినా భక్తులతో కిటకిటలాడుతాయి. ఈ నేపథ్యంలో రాయలసీమ జిల్లాల్లో ప్రసిద్ధి గాంచిన గండి వీరాంజనేయస్వామి ఆలయంలో ఎంతో వైభవంగా జరుగుతాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఆగస్టు 5 నుంచి శ్రావణమాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆలయ చరిత్రను పూర్వీకులు కథలుగా చెబుతున్న విషయాన్ని ఓ మారు గుర్తుకు చేసుకుందాం.

సీతాదేవి కోరిక మేరకు..

రావణ సంహరణానంతరం సీతా సమేతుడైన శ్రీరామచంద్రమూర్తి తిరిగి అయోధ్య వెళుతున్న సమయాన గండి క్షేత్రానికి వచ్చే సరికి చీకటి పడిందట. ఈ సమయంలో కొండకు కనిపించిన పెద్ద రాయిని చూసిన సీతకు అక్కడ తెల్లవారుజామున శుభగడియలు ముగిసేలోపు ఆంజనేయుడి విగ్రహాన్ని బాణపు ములికితో చెక్కాలని కోరిందట. దీంతో శ్రీరాముడు ఆమె కోరిక మేరకు ఆంజనేయుడి విగ్రహాన్ని చెక్కడం ప్రారంభించారు. శుభగడియలు ముగిసే సరికి ఆంజనేయుడి ఎడమచేయి చిటెకెన వ్రేలు మాత్రమే కొదవ పడటంతో.. ఆ ప్రయత్నం అంతటితో ఆపేసి విగ్రహాన్ని ప్రతిష్టింప జేశాడు. అనంతరం పూర్వీకులు భిన్నంగా ఉన్న విగ్రహం పూజలకు పనికి రాదని భావించి చిటికెన వ్రేలిని చెక్కించేందుకు శిల్పిని రప్పించి పని ప్రారంభించారు. శిల్పి వేసిన ఉలి దెబ్బ పడగానే ఆచోటి నుంచి రక్తం రావడంతో భయపడి మూర్ఛ చెంది పడిపోయారు. అనంతరం ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. సీతాదేవి ఆంజనేయుడిని చిరంజీవిగా వర్ధిల్లు అని ఆశీర్వదించినట్లుగా ఆయన ఇక్కడ సజీవంగా ఉన్నాడని భావించి అప్పటి నుంచి పూజలు చేస్తున్నారు. దీంతో ఇక్కడి ఆంజనేయుడిని భక్తులు ఎంతగానో నమ్ముతారు.

బంగారు తోరణం

గండిలో సీతాసమేతంగా విచ్చేస్తున్న శ్రీరాముడికి స్వాగతం పలికేందుకు గండిలో తపస్సు చేసుకుంటుండిన వాయుదేవుడు.. రెండు కొండల మధ్యన బంగారు తోరణం నిర్మించి వారికి స్వాగతం పలికాడట. ఆ బంగారు తోరణం నేటికి కూడా ఉందని భక్తుల నమ్మకం. అది పుణ్యాత్ములకు మాత్రమే కనిపిస్తుందట. ఇప్పటి వరకు ఆ తోరణం ఇద్దరికి మాత్రమే కనిపించిందట. వారిలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్న సమయంలో జిల్లా కలెక్టరుగా ఉండిన సర్‌ థామస్‌ మన్రో ఒకరు కాగా, గండి భూమానందాశ్రమ పీఠాధిపతి రామానందస్వామి మరొకరట.

గండి అంటే..

గండిలో ఉన్న కొండలను శేషాచల కొండలు అంటారు. ఇవి తిరుమల నుంచి గండి వరకు మధ్యలో ఎక్కడేగానీ తెగువ లేకుండా ఉన్నాయట. అలాంటి ఈ శేషాచల కొండలను పాపాఘ్ని నది మధ్యలో గండి పెట్టిందట. దీంతో ఈ ప్రాంతానికి గండి అని పేరు వచ్చిందట. ఇక్కడ వెలసిన స్వామిని గండి వీరాంజనేయస్వామి అని పిలుస్తారు.

పాపాఘ్ని నది

నందిపాద సముద్భూతా పాపాఘ్ని పుణ్యదాయినీ అని వాయు పురాణం చెప్పింది. నంది పాదం అనగా కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లాలోని నంది కొండల్లో పుట్టి గండి మీదుగా కమలాపురం సమీపంలోని పెన్నా నదిలో కలుస్తుంది. ఈ నది పాపాలను హరించి వేస్తుందని, అందుకే దీన్ని పాపాఘ్ని నది అని పిలుస్తారు.