News

మలయాళస్వామి బోధలు పాఠ్యాంశాలు కావాలి

57views

ఏర్పేడు వ్యాసాశ్రమ స్థాపకుడు సద్గురు మలయాళ స్వామి 105 ఏళ్ల క్రితం అందించిన సందేశాన్ని పాఠ్యాంశంగా తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రముఖ సాహితీవేత్త, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. స్వామి బోధనలు సమగ్ర గ్రంథావళి, శుష్క వేదాంత తమో భాస్కరం పుస్తకాలలో కీలక అంశాలను మోక్షానికి అర్హత–కులమా? గుణమా? శీర్షికన హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పాత్రికేయడు జి.వల్లీశ్వర్‌ సులభ శైలిలో తిరిగి రాశారు.

ఆదివారం ఈ పుస్తకావిష్కరణ రాజమహేంద్రవరం నగరంలోని రివర్‌ బే ఆహ్వానం ఫంక్షన్‌ హాలులో సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జొన్నవిత్తుల ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ రామాయణ, మహాభారతాలు మన రక్తంలో అంతర్వాహినిగా ఉన్నాయని, అందుకే ఇన్ని కులాలు ఉన్నప్పటికీ అందరూ ఐక్యంగా ఉంటున్నామన్నారు. వివిధ కారణాలతో కులాలను రెచ్చగొట్టడాలకు అడ్డుకట్ట వేయడానికే సద్గురు మలయాళ స్వామి లాంటి మహనీయాలు తమ బోధనలతో ప్రజలను జాగృతం చేశారన్నారు. ఆయన బోధనలు 8వ తరగతి నుంచి డిగ్రీ వరకు పాఠ్యాంశాలుగా రావాల్సిన అవసరం ఉందన్నారు. అందరూ ఐక్యంగా ఉంటూ అమృత కలశం లాంటి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని జొన్నవిత్తుల సూచించారు. ప్రముఖ సామాజిక కార్యకర్త పోలుకొండ వెంకట శ్రీనివాస్‌, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్‌ కర్రి రామారెడ్డి తదితరులు పాల్గొన్నారు.