(జూలై 31 – ఉధమ్ సింగ్ బలిదానం జరిగిన రోజు )
బ్రిటిష్ వారి నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు ఎందరో విప్లవకారులు తమ జీవితాలను త్యాగం చేశారు. ఆ యోధులలో పంజాబ్ నుండి చాలా మంది ధైర్యవంతులు కూడా ఉన్నారు. వారిలో ఒకరు సర్దార్ ఉధమ్ సింగ్. 21 ఏళ్ల సుదీర్ఘ కాలం ఎదురు చూసి జలియన్‌వాలాబాగ్ మారణహోమానికి ప్రతికారం తీర్చుకున్న విప్లవ స్ఫూర్తికి నిలువుటద్దం సర్దార్ ఉధమ్ సింగ్. భారతీయులను అణిచివేసేందుకు నాటి బ్రిటిష్ ప్రభుత్వం 1919లో రౌలత్ చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన జాతీయోద్యమ నేతలను అరెస్ట్ చేయడంతో దీనిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ప్రజాందోళనలు నిర్వహించారు. జలియన్‌వాలాబాగ్‌లోనూ వారి అరెస్టులను ఖండిస్తూ సంఘీభావం తెలియజేశారు. అలా 1919 ఏప్రిల్ 13న బైశాఖి రోజున అమృత్‌సర్‌లోని జలియన్‌వాలాబాగ్‌లో శాంతియుతంగా జరుగుతున్న సభపై ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా బ్రిటిష్ సైన్యం బ్రిగేడియర్ జనరల్ డయ్యర్ ఆదేశాలను అనుసరించి విచక్షణారహితంగా కాల్పులు జరిపింది.
రౌలర్ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ప్రజలపై అత్యంత క్రూరంగా తూటాలు ప్రయోగించడంతో పంజాబ్‌కు చెందిన యువకులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు 1000 మందికి పైగా చనిపోయారు. 1,200 మంది వరకు గాయపడ్డారు. ఈ మారణహోమం జరుగుతున్న సమయంలో 20 ఏళ్ల యువకుడైన సర్దార్ ఉధమ్ సింగ్ అక్కడే ఉన్నాడు. బ్రిటిష్ పాలకుల నిరంకుశ చర్యను కళ్లారా చూసిన ఉధమ్ సింగ్..ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటానని భరతమాతకు ప్రమాణం చేశాడు.
ఉధమ్ సింగ్ 1899 డిసెంబర్ 26న పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లా సునమ్‌లో షేర్ సింగ్‌గా జన్మించాడు. తండ్రి పేరు తెహల్ సింగ్, తల్లి పేరు నరైన్ కౌర్. చిన్నతనంలో తల్లిని, యుక్త వయసులో తండ్రిని కోల్పోయిన షేర్ సింగ్‌ను ఆయన మేనమామ ఖాల్సా అనాథాశ్రమానికి అప్పగించారు. ఆ అనాథాశ్రమం వారే ఆయనకు ఉధమ్ సింగ్‌గా నామకరణం చేశారు. అక్కడ ఆయన్ను అందరూ ఆప్యాయంగా ఉడే అని పిలిచేవారు. కొంత కాలం బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో పని చేసిన ఉధమ్ సింగ్ 1919 ప్రారంభంలో అమృత్‌సర్‌లోని తన అనాథాశ్రమానికి తిరిగి వచ్చేశాడు. అదే ఏడాది జరిగిన జలియన్‌వాలాబాగ్ మారణహోమం ఉధమ్ సింగ్ జీవితాన్ని విప్లవం దిశగా అడుగులు వేయించింది.
జలియన్‌వాలాబాగ్ దురాగతం తర్వాత ఉధమ్ సింగ్ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న విప్లవకారులతో చేతులు కలిపాడు. భగత్ సింగ్ ప్రభావంతో ఉద్యమంలో చేరాడు. తొలుత గదర్ పార్టీలో చేరిన ఆయన ఆ తర్వాత ఆజాద్ పేరుతో సొంత పార్టీని స్థాపించి మెల్లగా తన లక్ష్యం దిశగా పయనించడం మొదలు పెట్టాడు. జనరల్ డయ్యర్‌ను చంపేందుకు వనరుల సేకరణ ప్రారంభించాడు. మరోవైపు, జలియన్‌వాలాబాగ్ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా బ్రిటిష్‌వారిపై విమర్శలు రావడంతో జనరల్ డయ్యర్ రాజీనామా చేసి బ్రిటన్‌కు తిరిగివెళ్లిపోయాడు. అయితే జనరల్ డయ్యర్‌ను చంపాలని నిర్ణయం తీసుకున్న ఉధమ్ సింగ్ జపాన్, బర్మ, ఇటలీ, జర్మనీ, పోలాండ్, ఫ్రాన్స్‌లోని భారతీయులను సంప్రదించడం మొదలుపెట్టాడు. అయితే 1927లో జనరల్ డయ్యర్ అనారోగ్యంతో మరణించాడు. ఇదే సమయంలో విప్లవకారులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నాడనే ఆరోపణలపై ఉధమ్ సింగ్‌ను బ్రిటిష్‌వారు జైలుకు పంపారు. అలా జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన ఉధమ్ సింగ్ 1934లో మారువేషంలో నైరోబీ, ఆఫ్రికా, బ్రెజిల్ తదితర దేశాల మీదుగా లండన్ చేరుకున్నాడు. జనరల్ డయ్యర్ మరణించినప్పటికీ జలియన్‌వాలాబాగ్ మారణకాండకు కారణమైన మరో అధికారి మైఖేల్ ఓడ్వైర్‌ను చంపాలని నిర్ణయించుకున్నాడు.
లండన్‌లోని రాయల్ సెంట్రల్ ఏషియన్ సొసైటీకి చెందిన కాక్ట్సన్ హాల్‌లో మైఖేల్ ఓడ్వైర్ ప్రసంగిస్తూ, అవకాశం ఇస్తే జలియన్‌వాలాబాగ్ మారణకాండను పునరావృతం చేస్తానని అన్నాడు. ఇది విన్న ఉధమ్ సింగ్ ఒక్కసారిగా కోపోద్రేకుడై తన రివాల్వర్‌తో మైఖేల్ ఓడ్వైర్ పై బుల్లెట్ల వర్షం కురిపించాడు. అలా 21 ఏళ్ల క్రితం చేసిన శపథాన్ని నేరవేర్చుకున్న ఉధమ్ సింగ్ నవ్వుతూ బ్రిటిష్‌వారికి లొంగిపోయాడు. వారు ఆయన్ను 1940 జూలై 31న లండన్‌లో ఉరి తీశారు. విచారణ సందర్భంగా ఓడ్వైర్‌ను ఎందుకు చంపావని అడిగితే, ‘‘అతనంటే నాకు పగ..అతడికి ఇలా జరగాల్సిందే..నేను ఏ పార్టీకి కూడా చెందను…నాకు చావు అంటే భయం లేదు..ముసలితనం వచ్చేవరకు జీవించి ఏం ప్రయోజనం,’’ అని బదులిచ్చాడు. భారతదేశం జోలికి వస్తే తనలాంటి యువకులు వందల మంది లండన్ రావాల్సి వస్తుందని తెల్లదొరలను హెచ్చరించి, వారి గుండెల్లో భయం పుట్టించిన ధీరుడు ఉధమ్ సింగ్. వలసరాజ్యాన్ని కూలదోసేందుకు భారతీయులను సంఘటితం చేసిన ఉధమ్ సింగ్ సదా స్మరణీయుడు.