ArticlesNews

కాశీ కారిడార్ లాగే మహాబోధి, విష్ణుపాద కారిడార్‌ : బడ్జెట్‌ సందర్భంగా కేంద్రం ప్రకటన

53views

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఏడోసారి పార్లమెంట్‌లో తన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా బిహార్‌లోని నలంద వర్శిటీతో పాటు నలంద `రాజ్‌గిరి కారిడార్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. నలంద యూనివర్శిటీని అద్భుతమైన స్థాయికి పునరుద్ధరించడంతో పాటు టూరిజం డెస్టినేషన్‌గా తీర్చిదిద్దుతామని వెల్లడతించారు. మరోవైపు పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కాశీ కారిడార్‌ తరహాలో మహాబోధి మరియు విష్ణుపాద్‌ కారిడార్లను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. మన నాగరికతలో పర్యాటకం అనేది ఎప్పుడూ ఓ భాగమేనని, భారత్‌ని గ్లోబల్‌ టూరిస్ట్‌ డెస్టినేషన్‌గా మార్చడానికి ప్రయత్నాలు చేస్తామన్నారు.

దీని ద్వారా కొత్త ఉద్యోగాలను కల్పిస్తామని, ఇతర రంగాలలో కూడా కొత్త అవకాశాలను సృష్టిస్తాయన్నారు. గయలోని విష్ణుపాద దేవాలయం మరియు బోధగయలోని మహాబోధి దేవాలయం చాలా ముఖ్యమైన ప్రదేశాలని, కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ తరహాలో రెండు చోట్ల కారిడార్లను నిర్మిస్తామన్నారు. తద్వారా అవి ప్రపంచ పర్యాటక కేంద్రాలుగా మారుతాయన్నారు. వీటితో పాటు పాట్నా`పూర్నియా ఎక్స్‌ప్రెస్‌వే, బక్సర్‌` భాగల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌వే, బుద్ధగయ`రాజ్‌గిర్‌ వైశాలి దర్భంగా ఎక్స్‌ప్రెస్‌వే కూడా నిర్మిస్తామన్నారు. బక్సర్‌లోని గంగా నదిపై రెండు లైన్ల వంతెనను కూడా నిర్మించనున్నారు. దీనికోసం 26000 కోట్లను ఖర్చు చేస్తామన్నారు.

బుద్ధగయలో వున్న మహాబోధి ఆలయం పురాతన బౌద్ధ దేవాలయాలలో ఒకటి. క్రీ.పూ. 3 వ శతాబ్దంలో అశోక చక్రవర్తి ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఆలయం ఎత్తు 52 మీటర్లు. ఇందులో బంగారు బుద్ధుని విగ్రహం వుంది. బుద్ధగయలోనే బుద్ధుడికి జ్ఞానోదయం పొందాడు. అందుకే ఈ ఆలయం బౌద్ధ సన్యాసులకు అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు. పవిత్ర బోధి వృక్షం ఉంది. ఇది ద్రవిడుల నిర్మాణ శైలిలో ఉంది. మహాబోధి ఆలయాన్ని అశోక చక్రవర్తి క్రీస్తూ పూర్వం 3వ శతాబ్దంలో నిర్మించగా.. క్రీస్తు శకం 5-6 శతాబ్దాల్లో గుప్తులు మరింతగా ఆలయాన్ని అభివృద్ధి చేసినట్టు చరిత్రకారులు చెబుతుంటారు. అశోకుడి కాలంలో వజ్రాసనను నిర్మించి గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన బోధి వృక్షం కింద స్థాపించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. అక్కడ అశోకుడి కాలం నాటి శాసనాలు కూడా తవ్వకాల్లో బయటపడి కనిపిస్తాయి.

ఆనాటి నుంచి ఇప్పటికీ దాని అసలు రూపం లో నిలబడి, పూర్తిగా ఇటుకలతో నిర్మించిన ప్రాధమిక బౌద్ధ దేవాలయాలలో ఒకటిగా మహాబోధి ఆలయం నిలిచిందని చెబుతుంటారు. ప్రధాన గోపురాన్ని 19వ శతాబ్దంలో 55 మీటర్ల ఎత్తులో పునర్నిర్మించారు. ప్రధాన గోపురం చుట్టూ, అదే శైలిలో నాలుగు చిన్న గోపురాలు కూడా ఉన్నాయి. ఈ మహాబోధి ఆలయ నాలుగు సరిహద్దులు రెండు మీటర్ల ఎత్తులో దగ్గరగా రాతి రైలింగుతో ఉన్నాయి. వీటిపై సూర్యుడు, లక్ష్మి, ఇంకా అనేక భారతీయ దేవీ దేవతల విగ్రహాలతో ఉంటే, కొన్ని రైలింగ్ లు తామరపూలతో కనిపిస్తాయి.మహాబోధి ఆలయం ఒక బౌద్ధ ఆలయమని అందరికీ తెలుసు. అయితే గర్భాలయంలో గౌతమ బుద్ధుడి విగ్రహం ఎదురుగా మహాశివుడు లింగాకారంలో కనిపిస్తాడు. హిందూ-బౌద్ధ మతాలకు చెందిన భిక్షువులు ఇక్కడ నిత్య పూజలు నిర్వహిస్తూ ఉంటారు.