News

పర్యావరణ హిత విగ్రహాలతో ఉత్సవాలు

54views

పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత అందరిపై ఉందని, వినాయక చవితి, విజయదశమి ఉత్సవాలకు మట్టి విగ్రహాలే వినియోగించి నిమజ్జనం చేసేలా అవగాహన పెంచాలని జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి ఆదేశించారు. వినాయక చవితి, విజయదశమి ఉత్సవాల నిర్వహణ, సీజనల్‌ వ్యాధుల నియంత్రణ, పారిశుద్ధ్యంపై మున్సిపల్‌ కమిషనర్లు, ఇతర అధికారులతో స్థానిక కలెక్టరేట్‌లోని బోర్డు మీటింగ్‌ హాల్‌ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సెప్టెంబర్‌లో జరిగే వినాయకచవితి, అక్టోబర్‌లో జరిగే విజయదశమి ఉత్సవాల నిర్వహణకు మట్టితో చేసిన ఉత్సవ విగ్రహాలను వినియోగించేలా చూడాలన్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల మేరకు.. ముందస్తుగా విగ్రహ తయారీదారులకు హెచ్చరిక జారీ చేస్తూ.. పివోపీ స్థానంలో పర్యావరణ సహిత మట్టిబొమ్మలు తయారుచేయాలని సూచించాలన్నారు. పాఠశాలలు, జనావాస ప్రాతాల్లో పోస్టర్లు, కరపత్రాల రూపంలోనూ, మీడియా ద్వారా మట్టి విగ్రహాల వినియోగంపై విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే వారిపై ధిక్కార చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, పోలీస్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్‌ సమన్వయంతో పనిచేసి.. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలన్నారు. ఉత్సవాలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్య పరిరక్షణలో ప్రతి ఒక్క అధికారి భాగస్వామ్యం కావాలన్నారు.అనంతరం మట్టి విగ్రహాల వాడకాన్ని ప్రోత్సహిస్తూ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వారు ప్రచురించిన గోడ పత్రాలు, కరపత్రాలను కలెక్టర్‌ ఆవిష్కరించారు.