ArticlesNews

శ్రీగిరిలో కళా వైభవం

60views

ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణకు శ్రీశైల దేవస్థానం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ధర్మపథం పేరుతో ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. గతంలో భక్తులు అధికంగా ఉండే శని, ఆది, సోమవారాల్లో మాత్రమే కళారాధన కార్యక్రమాలు నిర్వహించేవారు. అయితే ప్రస్తుతం ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తద్వారా కళాకారులను దేవస్థానం పోత్సహిస్తోంది.

శ్రీశైల ఆలయంలో వెలసిన భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ దేవస్థాన అధికారులు, అర్చకులు పరిపూర్ణంగా జరిపిస్తున్నారు. అలాగే స్వామిఅమ్మవార్ల భక్తి గీతాలతో పాటు, సంప్రదాయ నృత్య ప్రదర్శనలతో భక్తుల్లో మరింత భక్తి భావం పెంపొందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. శ్రీశైల క్షేత్రానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. క్షేత్రానికి విచ్చేసిన భక్తులకు సౌకర్యవంతమైన స్వామిఅమ్మవార్ల దర్శనంతో పాటు క్షేత్ర పరిధిలో ఉన్నంతవరకు ఆధ్యాత్మికతతో మెలిగేలా భక్తి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కళారాధన కార్యక్రమంలో భాగంగా హరికథ, బుర్రకథ, భక్తిరంజని, గాత్ర సంగీతం, భజన, తోలుబొమ్మలాట, వీణా కచేరి, మృదంగ విన్యాసం, సంప్రదాయ నృత్య ప్రదర్శన ఇలా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆయా కార్యక్రమాల ద్వారా పలువురు కళాకారులు భక్తి గీతాల ఆలాపన, భక్తి గీతాలకు సంప్రదాయ నృత్య ప్రదర్శనలు చేస్తూ భక్తులను అలరిస్తూ వారిలో ఆధ్యాత్మికత పెంపొందిస్తున్నారు.

గతంలో వారానికి మూడు రోజులు మాత్రమే..:
శ్రీశైల దేవస్థానంలో గతంలో భక్తులు అధికంగా ఉండే శని, ఆది, సోమవారాల్లో మాత్రమే కళారాధన కార్యక్రమాలు నిర్వహించేవారు. అయితే ప్రస్తుతం ధర్మపథం పేరుతో ప్రతిరోజూ కళారాధన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆలయ దక్షిణ మాఢవీధిలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. స్వామిఅమ్మవార్ల దర్శనం అనంతనం భక్తులు కళారాధన వేదికకు చేరుకుంటారు. అక్కడ కార్యక్రమాలను వీక్షిస్తూ అధ్యాత్మిక పరవశం పొందుతున్నారు.

తెలుగు, కన్నడ భాషల్లోనూ..:
క్షేత్రంలో మహాశివరాత్రి, ఉగాది, కార్తీకమాసం తదితర ముఖ్య పర్వదినాలు, ఉత్సవాల రోజుల్లో ఆలయ దక్షిణ మాఢవీధిలో ఉన్న కళావేదికతో పాటు, ఆలయ పుష్కరిణి వద్ద, శివదీక్షా శిబిరాల వద్ద ప్రత్యేకంగా కళావేదికలను ఏర్పాటు చేసి సినీ నేపథ్య గాయకులు, సంగీత దర్శకులతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఉగాది మహోత్సవాలకు కన్నడ ప్రాంతానికి చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. వారి సౌకర్యార్థం కన్నడ భాషలోను కళారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఆధ్యాత్మిక భావన పెంచేందుకే..
శ్రీశైల దేవస్థానంలో ధర్మపథం పేరుతో ప్రతి రోజు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఆయా కార్యక్రమాల్లో గ్రామీణ పేద కళాకారులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం. తద్వారా వారిని కళలలో పోత్సహిస్తూ, పేద కళాకారులకు ఆర్థిక సహకారాన్ని అందించే విధంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ప్రశాంతమైన వాతావరణంలో నిత్యకళారాధన కార్యక్రమాలను నిర్వహిస్తూ భక్తులకు అధ్యాత్మిక చింతన పెంపొందించేలా కృషి చేస్తున్నాం. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో, ఉగాది మహోత్సవాల్లో, కార్తీకమాసంలో ప్రతి సోమవారం, పౌర్ణమి రోజుల్లో అదనంగా కళావేదికలు ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.– డి.పెద్దిరాజు,శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి