ArticlesNews

కోపాన్ని ఎలా జయించాలంటే..

43views

క్రోధం అనే అంతశ్శత్రువు మనల్ని ఎప్పుడూ రెచ్చగొడుతూ ఉంటుంది. కానీ మనం నిదానంగానే ఉండాలి. ఆవేశపడితే ఆత్మ నశిస్తుంది- అని హెచ్చరిస్తోంది మహాభారతం. ఎంతటి మహాజ్ఞానులు కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. ఉదాహరణకు బ్రహ్మర్షి కావడానికి ముందు విశ్వామిత్రుడు క్షత్రియుడు. తన కోపం కారణంగా ఆయన ఎన్నో కష్టాలు కొనితెచ్చుకున్న ఉదంతాలను పురాణాలు పేర్కొన్నాయి. వశిష్టుడి వద్దనున్న మహిమాన్వితమైన హోమధేనువును తనకు ఇవ్వమని విశ్వామిత్రుడు అడిగితే- నిరాకరించాడు. దాంతో విశ్వామిత్రుడు ఆగ్రహించి, ఆ గోవును బలవంతంగా తరలించుకుని రమ్మని సైన్యాన్ని పంపాడు. అప్పుడు ఆ హోమధేనువు నుంచి సైన్యం పుట్టుకొచ్చి, విశ్వామిత్రుడి సైన్యాన్ని ఓడించింది. వశిష్టుడి మహిమలకు అతడి తపశ్శక్తే కారణమని గ్రహించాడు విశ్వామిత్రుడు. రాజ్యాన్ని వదిలి తపస్సు ఆరంభించాడు. వశిష్టుడిలా తను కూడా ‘బ్రహ్మ’ అనిపించుకోవాలని తపిస్తుంటాడు. కానీ.. ‘కోపాన్ని త్యజించినవాడే బ్రహ్మర్షి అవుతాడు’ అని వశిష్టుడు వివరించడంతో.. విశ్వామిత్రుడికి జ్ఞానోదయం అయ్యింది. కోపద్వేషాలు లేని నిర్మలమైన ప్రేమే శాంతిని చేకూరుస్తుంది. అందరికీ దగ్గర చేస్తుంది. ప్రేమమూర్తులకు శత్రువులు ఉండరు. అలాంటి అజాత శత్రువులను ఆదరించి, అక్కున చేకూర్చుకుంటారు.