News

ఉత్తరాఖండ్ లోనూ కావడి మార్గం నిబంధనలు

57views

ఉత్తర్‌ప్రదేశ్‌లో కావడి యాత్రా మార్గం వెంబడి ఉన్న హోటళ్లు, ధాబాలు, తోపుడుబండ్లపై వాటి యజమానుల పేర్లు, వివరాలు ప్రదర్శించాలంటూ ముజఫర్‌నగర్‌ జిల్లా అధికారులు జారీచేసిన ఉత్తర్వులను రాష్ట్రమంతటికీ వర్తింపజేయాలని శుక్రవారం యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. శ్రావణమాసంలో శివభక్తులు ఉత్తరాఖండ్, బిహార్‌లకు కావిళ్లతో వెళ్లి గంగాజలం తీసుకొని స్వస్థలాలకు వస్తారు. ఆ జలంతో స్థానిక శివాలయాల్లో అభిషేకాలు చేస్తారు. ఈ కావడి మార్గం ఒక్క ముజఫర్‌నగర్‌ జిల్లాలోనే 240 కిలోమీటర్ల పర్యంతం సాగుతుంది. కాగా, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కూడా కావడి మార్గంలో యూపీ తీసుకొచ్చిన ఆంక్షలను జులై 12 నుంచే అమలు చేస్తోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. యూపీ సర్కారు అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కావడి యాత్ర వెంబడి ఉన్న అన్ని మార్గాల్లో ఈ ఆంక్షలను అమలుచేసేలా త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. ఉపవాసంతో కావడి యాత్ర చేసే భక్తులు శుద్ధ శాకాహారం, సాత్వికాహారం ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోడానికి వీలుగా ఈ ఆజ్ఞలను జారీ చేశామని అధికారులు చెబుతున్నారు.