ArticlesNews

ప్రకృతి ఉపాసనే దేవీ ఉపాసన

57views

వేదాంగమైన జ్యోతిషంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు మానవ జీవనంలో సామాజిక, సాంఘిక, ఆర్థిక, వ్యక్తిగత, వైజ్ఞానిక పరమైన ప్రగతికి మార్గనిర్దేశనం చేస్తున్నాయి. ద్రష్టల్కెన మహాఋషులు వాటిలోని ప్రత్యేక అంశములను అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా ఉత్సవాలని, వేడుకలని సూచించారు.. వాటిని అనుసరించే మనం పండుగ లని జరుపుకుంటాం. ఇక మనకు నవరాత్రులు అనగానే గుర్తుకు వచ్చేవి దేవీ శరన్నవరాత్రులు. అయితే శరన్నవరాత్రులతోపాటు మరో మూడు నెలలలోనూ నవరాత్రులను జరిపే సంప్రదాయం ఉంది. వాటిని చైత్ర, ఆషాఢ, మాఘ మాసాల్లో నిర్వహిస్తారు.

చైత్రేశ్వినే తథాషాఢే మాఘే కార్యోమహోత్సవః।
చతుర్షు నవరాత్రేషు విశేషాత్ఫలదాయకః।
అని ‘దేవీ భాగవతం’ చెబుతోంది. గొప్ప ఫలితా లను కోరుకొనే వారు ఈ నాలుగు నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో సేవించాలని సూచి స్తోంది. ఇక ఆషాఢమాసంలో వచ్చే నవరాత్రు లని వారాహి నవరాత్రులనీ, లేదా శాకంబరీ నవరాత్రులనీ, గుప్త నవరాత్రులనీ అంటాం.

వారాహి దేవి లలితా పరాభట్టారిక సేనాని.. లలిత యొక్క రధ, గజ, తురగ, సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి. అందుకే ఆవిడను దండనాథ అంటారు. అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, ఆవిడ హలము (నాగలి), ముసలము (రోకలి) ధరించి కనిపిస్తుంది. నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే , రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు. దీనిబట్టి అమ్మవారు సస్యదేవత అని గ్రహించాలి. అంటే పాడిపంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లీ శ్రీ వారాహీ మాత. అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజిస్తాం. నిజానికి రైతు గో ఆధారిత వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి, సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహీ ఉపాసనే అవుతుంది. ఎందుకంటే వారాహీ అంటే ఎవరో కాదు సాక్షాత్తు భూమాత. ప్రకృతి పరంగా చూసినట్లైతే ఈ సమయంలో వర్షం కురుస్తుంది రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవు తారు. దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మీ స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది. అంతేకాక ఈ సమయంలోనే శాకంబరీ ఉత్సవాలను నిర్వహిస్తారు. సస్యప్రదాత అయిన అమ్మవారిని రకరకాల కూరగాయలతో దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అమ్మ వారిని శాకంబరీ దేవిగా అలంకరించి పూజిస్తారు.

అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలోనే చాలా గ్రామాల్లో ‘‘గ్రామ దేవత’’ల ఆరాధనోత్సవాలు, జాతరలు నిర్వహిస్తుంటారు. తెలంగాణలో ‘‘బోనాలు’’ పేరున గ్రామదేవతలు జాతర జరుగు తుంది. ఎందుకంటే, వర్షా కాలం ప్రారంభమవుతుంది. రైతులు అప్పుడే వ్యవసాయ పనులకు సంసిద్ధులవుతారు. ఇక ఈకాలం అంతా జ్వరాలు, అంటువ్యాధులు బారినపడే రోజులు. అందుకే రక్షణ కొరకు గ్రామ దేవతల ఆవిర్భావం. మన దేశంలోను, మన రాష్ట్రంలోను గ్రామీణ ప్రాంతాలే ఎక్కువ. గ్రామాల అభివృద్ధికి, ప్రజల సంక్షేమం నిమిత్తం గ్రామదేవతలు ఆవిర్భవించారు.

ఒక్కో గ్రామదేవతకు ఒక్కో చరిత్ర ఉంటుంది. పెద్దాపురంలో మరిడెమ్మగా, భీమ వరంలో మావుళ్ళమ్మగా, ద్వారకాతిరుమల వద్ద కుంకుళ్ళమ్మగా, విజయనగరంలో పైడితల్లిగా, సూళ్ళూరుపేటలో చెంగాళమ్మగా, విశాఖ పట్నంలో కనకమహాలక్ష్మిగా, అవనిగడ్డలో అంకాలమ్మగా.. ఇలా ప్రతిచోటా ఏదో ఒక నామంతో కొలువై ఉండి రక్షిస్తూ ఉన్నారు. ఏ పేరుతో పిలిచినా పలికే దేవత ఆ జగన్మాతయే. పంచభూతాల పేర్లతో కూడా అమ్మవారు ప్రసిద్ధి చెందారు. ఆకాశానికి ప్రతిగా కొండమ్మగా, జలదేవతకు ప్రతిగా గంగాలమ్మ, పృథ్వి (భూమి)కి ప్రతిరూపంగా అన్నం పెట్టే అన్నమ్మ నూకాలమ్మ అగ్నికి సూర్యచంద్రుల తేజస్సుకు ప్రతీకగా సూరమ్మ, పున్నమ్మ, వాయువుకు ప్రతిరూపంగా కరువలమ్మ ఇలా నామధేయాలతో ఆరాధిస్తున్నారు. గమనిస్తే ప్రస్తుతం ప్రతీ గ్రామంలో ఏదోరూపంలో అమ్మ కొలువై ఉంది. అందుకే, ప్రతీ సంవత్సరం జాతర పేరుతో ఉత్సవాలు, సంబరాలు చేస్తుండడం పరిపాటి.. ఇలా ప్రతిదాని లోనూ భగవంతున్ని దర్శించే సంస్కృతికి వారసులం మనం. అందుకే దాన్ని కాపాడు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది