News

‘ఆమె ఆస్తి కాదు ఆశీర్వాదం’

57views

‘‘అమ్మాయిలు లక్ష్మీ స్వరూపులు. ఏ తల్లిదండ్రులైనా వారిని వేరే ఇంటికి పంపాలని కోరుకోరు’’ అని రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ అన్నారు. ఇటీవల జరిగిన తన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహ వేడుకలో ‘కన్యాదానం’ ప్రాశస్త్యాన్ని ఆమె ఉద్వేగభరితంగా వివరించారు. నీతా మాటలకు అంబానీ కుటుంబసభ్యులతోపాటు అతిథుల కళ్లు చెమర్చాయి. ఈ వీడియో వైరల్‌గా మారింది. ‘‘హిందూ సంప్రదాయంలో కన్యాదానం అనేది చాలా గొప్పది. కానీ, ఓ కుమార్తె కొన్ని సంవత్సరాలుగా తన కుటుంబంతో పంచుకున్న అనుబంధం, ఆప్యాయత నుంచి ఎలా దూరం కాగలదు? పుట్టింటి బంధం శాశ్వతంగా ఉంటుంది. కుమార్తె అంటే ఆస్తి కాదు మరొకరికి బదిలీ చేయడానికి. ఆమె మన కుటుంబానికి దక్కిన ఆశీర్వాదం. కుటుంబంలోని ప్రేమ, ఆనందం, వెలుగుకు మూలం. పెళ్లి అనే బంధంతో ఇప్పుడామె అవన్నీ కొత్త కుటుంబంతోనూ పంచుకొంటుంది. మెట్టినింటిని స్వర్గంగా మారుస్తుంది’’ అని నీతా అంబానీ అన్నారు. ఈ మాటలకు భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్న అతిథులు చప్పట్లతో ఆమెను అభినందించారు.