News

గిరిజన గ్రామాలకు మంచి రోజులు

77views

సరైన రహదారి నోచుకోని గిరిజన గ్రామాలకు మంచి రోజులు రాబోతున్నాయి. కచ్చా రోడ్ల స్థానంలో తారు రోడ్లు నిర్మించనున్నారు. ‘ప్రధానమంత్రి జనజాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్‌’ కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రాష్ట్రంలో తొలి దశలో 6 జిల్లాల్లో పనులు చేపట్టనున్నారు. 149 గిరిజన ఆవాస ప్రాంతాల్లో రూ. 280.53 కోట్లతో 130 మార్గాలు బాగుపడనున్నాయి. అంచనా వ్యయంలో కేంద్రం 60%, రాష్ట్రం 40% నిధులు సమకూర్చనున్నాయి. త్వరలో టెండర్లు పిలవనున్నారు. గత వైకాపా ప్రభుత్వం రహదారుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం చేయడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోడ్లు లేక గిరిజనులు అత్యవసర సమయాల్లో డోలీలు కట్టుకొని కొండలు, గుట్టలు దాటాల్సి వచ్చింది. ఇలాంటి అవస్థలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం ‘ప్రధానమంత్రి జనజాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్‌’ పథకాన్ని గతేడాది నవంబరులో ప్రారంభించింది. రాష్ట్రంలో వందకిపైగా జనాభా కలిగిన 130 ఆవాసాల్లో తొలి దశలో 130 రోడ్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.115.72 కోట్లు సమకూర్చనుంది. రెండో దశలో మరో 122 ఆవాస ప్రాంతాల్లో పనులకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపనుంది.