News

సిక్కోలు జవాను వీరమరణం

50views

దేశ సరిహద్దుల్లో సిక్కోలు జవాను వీరమరణం పొందారు. జమ్మూ కశ్మీర్‌లోని డోడా జిల్లాలో సోమవారం రాత్రి ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో అసువులు బాశారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్ర గ్రామానికి చెందిన డొక్కరి చిట్టయ్య, పార్వతి దంపతుల పెద్ద కుమారుడు రాజేశ్‌(25) ఆరేళ్లుగా సైన్యంలో పని చేస్తున్నారు. 10 రోజుల నుంచి డోడా జిల్లా సరిహద్దు ప్రాంతంలో 10ఆర్‌ఆర్‌ (రాష్ట్రీయ రైఫిల్స్‌) బెటాలియన్‌ ఆల్ఫా కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్నారు. మూడు రోజులుగా ఉగ్రవాదుల గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. ఉగ్రవాదులు, జవాన్ల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో రాజేశ్‌ మెడకు బుల్లెట్‌ తగిలి మరణించినట్లు అతని కుటుంబ సభ్యులకు మంగళవారం ఉదయం అధికారులు సమాచారమిచ్చారు. విషయం తెలిసిన వెంటనే బంధువులు, స్నేహితులు పెద్దఎత్తున రాజేశ్‌ ఇంటికి తరలివచ్చారు. రాజేశ్‌ ప్రస్తుతం నాయక్‌ హోదాలో పని చేస్తున్నారని, చిన్నప్పటి నుంచి దేశభక్తి భావాలు కనబరిచేవాడని వారంతా గుర్తుచేసుకున్నారు. మూడు నెలల్లో ఇల్లు కట్టుకొని, పెళ్లి చేసుకుంటానని చెప్పారని, అంతలోనే ఈ దుర్వార్త వినాల్సి వచ్చిందని కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. రాజేశ్‌ భౌతిక కాయం బుధవారం రాత్రి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుతుందని, అక్కడి నుంచి స్వగ్రామానికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు.

విధి నిర్వహణలో మరొకరు..

శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం వల్లభరాయపాడు గ్రామానికి చెందిన ఆర్మీ జవాను సనపల జగదీశ్వరరావు (42) జమ్మూ కశ్మీర్‌లో విధి నిర్వహణలో చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారమందింది. ఆయన 22 ఏళ్ల కిందట సైన్యంలో చేరారు. గతేడాది హవల్దారుగా ఎంపికయ్యారు. ఆయన భార్య సమత దిమిలాడ గ్రామ సచివాలయంలో మహిళా పోలీసుగా పని చేస్తున్నారు. వీరికి కుమార్తెలు మోక్ష (8), దీక్ష (6) ఉన్నారు.