News

కుప్పకూలనున్న 20 స్టార్‌లింక్‌ శాటిలైట్లు

41views

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్ కు చెందిన ప్రైవేట్‌ అంతరిక్ష సంస్థ స్పేస్‌ ఎక్స్‌కు గట్టి ఎదురుదెబ్బ. అది గురువారం ప్రయోగించిన 20 స్టార్‌లింక్‌ ఉపగ్రహాలు త్వరలో కుప్పకూలనున్నాయి. స్పేస్‌ ఎక్స్‌ కూడా దీన్ని ధ్రువీకరించింది. ప్రయోగ సమయంలో చోటుచేసుకున్న పొరపాటే ఇందుకు కారణమని తెలిపింది. ‘‘గురువారం రాత్రి ప్రయోగం మొదలైన కాసేపటికి ఫాల్కన్‌–9 రాకెట్‌ రెండో దశ ఇంజన్‌ సకాలంలో మండటంలో విఫలమైంది.

దాంతో ఉపగ్రహాలు ఉద్దేశించిన కక్ష్యకు బదులు భూ దిగువ కక్ష్యలోకి ప్రవేశించాయి. దాంతో వాటి మనుగడ అసాధ్యంగా మారింది. అవి త్వరలో భూ వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోనున్నాయి’’ అని వివరించింది. అయితే, ‘‘వాటివల్ల ఇతర ఉపగ్రహాలకు ఏ సమస్యా ఉండబోదు. అలాగే ఉపగ్రహాలు ఒకవేళ భూమిని తాకినా జనావాసాలకు ముప్పేమీ ఉండదు’’ అని స్పష్టం చేసింది. ఇన్నాళ్లూ అత్యంత విశ్వసనీయంగా పని చేసిన ఫాల్కన్‌–9 రాకెట్‌ చరిత్రలో ఇది తొలి భారీ వైఫల్యంగా చెప్పవచ్చు.