ArticlesNews

రాంచీలో ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రాంత ప్రచారక్ బైఠక్

182views

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారత ప్రాంత ప్రచారక్ బైఠక్ శనివారం ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రారంభమైంది. రెండు రోజుల ఈ సమావేశంలో సంస్థకు చెందిన ప్రధాన నేతలందరూ పాల్గొన్నారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ -ఆర్ఎస్ఎస్ సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్, సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబళే, సంయుక్త సర్‌కార్యవాహలు, వివిధ రాష్ట్రాల ప్రాంత ప్రచారక్‌లు, సంయుక్త ప్రాంత ప్రచారక్‌లు, క్షేత్ర ప్రచారక్‌లు, సంయుక్త క్షేత్ర ప్రచారక్‌లు, ఆర్ఎస్ఎస్ ప్రేరిత, అనుబంధ సంస్థల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

వివిధ రంగాల్లో వ్యూహాత్మక ప్రణాళికలు, సమగ్ర సమీక్షలు చేపట్టడం ఈ సమావేశం ప్రాథమిక లక్ష్యం. అవేంటంటే…

1. విద్యా సంబంధ కార్యక్రమాలు: సంఘానికి సంబంధించిన విద్యా కార్యక్రమాల ప్రగతిని, సంస్థ కార్యకర్తల అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలను అంచనా వేస్తారు. ప్రస్తుతం అమల్లో ఉన్న శిక్షణా విధానాలను మెరుగుపరచడానికి, నైపుణ్యాల అభివృద్ధికి గల అవకాశాలను చర్చిస్తారు.

2. సంఘం శతాబ్ది సందర్భంగా విస్తరణ ప్రణాళికలు: ఆర్ఎస్ఎస్ త్వరలో శతాబ్ది వేడుకలు జరుపుకోబోతోంది. ఆ సందర్భంగా సంఘాన్ని మరింత విస్తరించడానికి ప్రణాళికలు రచిస్తారు. కొత్త జనసమూహాలకు చేరువ అవడానికి, సంస్థను మరిన్ని ప్రాంతాల్లోకి విస్తరించడానికి, ప్రజలకు చేరువయ్యే విధానాలను పెంపొందించడానికి వ్యూహాలను చర్చిస్తారు.

3. సామాజిక మార్పులపై అనుభవ సారం: సామాజిక మార్పుకు సంబంధించిన ఐదు ప్రధాన అంశాలపై సంఘ్ సీనియర్ నేతలు తమ అనుభవాలను పంచుకుంటారు. సమాజ సంక్షేమానికి చేపట్టే చర్యలు, సమాజాన్ని సంఘటితం చేయడంలో సంఘం పాత్ర వంటి అంశాలు ప్రస్తావనకు వస్తాయి.

4. ప్రస్తుత సందర్భంలో దిశావ్యూహం: ప్రస్తుత సామాజిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో సంఘం దశ, దిశను నిర్ణయించడం గురించి చర్చిస్తారు. ఆధునిక సమాజంలో ఎదురయ్యే సవాళ్ళు, అందివచ్చే అవకాశాలను బట్టి సంఘం కార్యాచరణ ఎలా ఉండాలన్న దాన్ని చర్చిస్తారు.

రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో సమష్టి ప్రణాళికా విధానం, సంస్థాగత నిర్ణయాత్మకత వంటి అంశాలకు తావు కల్పించే వేదికగా ‘అఖిల భారత ప్రాంత ప్రచారక్ బైఠక్’కు ప్రాధాన్యం ఉంది. సామాజిక అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా సంఘం ఎప్పటికప్పుడు తనను తాను మలచుకునే ప్రక్రియకు ఈ వేదిక దోహదకారిగా నిలుస్తుంది. నిస్వార్థ సేవ, సమాజ అభ్యున్నతి అనే లక్ష్యాల దిశగా సంఘం ప్రస్థానాన్ని ఈ సమావేశం నిర్దేశిస్తుంది.