
శ్రీవారి ఆలయానికి సంబంధించిన పలు ఆచార వ్యవహారాలు, వైఖానస ఆగమోపచారాలు, పలు అంశాలపై ఆలయ అర్చకులు, ఆగమ పండితులతో టీటీడీ ఈవో జె.శ్యామలరావు సమీక్షించారు.
సమీక్షా సమావేశంలో జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, ఆగమ సలహాదారులు, ప్రధాన అర్చకులు, తిరుమల శ్రీవారి ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
అంతకుముందు తిరుమలలో వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా జరుగుతున్న వివిధ ఆచారాలు, కైంకర్యాల గురించి ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, శ్రీకృష్ణ శేషాచల దీక్షితులు, గోవిందరాజ దీక్షితులు ఈఓకు వివరించారు.ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలోని వేద విద్యార్థులకు అపరెంటీస్ గా అవకాశం కల్పించి, వారు భవిష్యత్తును నిర్మించుకునేలా చేయాలని అర్చకులు ఈఓకు సూచించారు.
గతంలో ప్రతి సోమవారం ఆర్జిత సేవగా నిర్వహించే విశేష సేవను కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా నిర్వహించాలని ఈఓను కోరారు.
అనంతరం తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయానికి చెందిన శ్రీనివాస దీక్షితులు మాట్లాడుతూ, కోవిడ్ కాలంలో తగ్గించిన ప్రసాద దిట్టం ఇంకా కొనసాగుతూనే ఉందని, దానిని పెంచాలని ఈఓ దృష్టికి తీసుకెళ్లారు.ఆగమ సలహాదారులు ఆలయం ప్రతిష్టటకు భంగం కలుగకుండా పురాతన సంప్రదాయాలు పరిరక్షించడంలో, ఆచారాలకు విఘాతం కలుగకుండా చూసుకోవడంలో తమ పాత్రను ఈఓ కు తెలియజేశారు.
ఈ రెండు సమావేశాల అనంతరం శ్రీవారి అన్నప్రసాదాలపై ఆలయ, పోటు అధికారులతో ఈఓ సమీక్షించారు.





