ArticlesNews

అగ్గి పిడుగు అల్లూరి

84views

(జూలై 4 – అల్లూరి సీతారామ రాజు జయంతి)
బ్రిటిష్ పాలనలో వనవాసీలపై జరుగుతున్న దౌర్జన్యాలు, అన్యాయాలను చూసిన ఓ వ్యక్తి హృదయం రగిలిపోయింది. విల్లు, బాణాలు ఎక్కుపెట్టి రాంపా తిరుగుబాటు ప్రారంభించి బ్రిటిష్‌ వారి మూలాలను కదిలించాడు. అతనే వనవాసీల పాలిట ఆరాధ్యదైవం..మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు. వనవాసీల హక్కుల కోసం, స్వాతంత్ర్యం కోసం పోరాడి 27 ఏళ్ల చిన్న వయసులోనే ప్రాణ త్యాగం చేసిన అల్లూరి సీతారామ రాజు 1897 జూలై 4న విశాఖపట్నం జిల్లా పాండ్రంగిలో జన్మించారు. ఆయన తండ్రి పేరు వెంకట రామరాజు, తల్లి పేరు సూర్య నారాయణమ్మ. చిన్నతనంతోనే తండ్రి చనిపోవడంతో గోదావరి జిల్లా నర్సాపూర్‌లోని మేనమామ రామకృష్ణంరాజు వద్ద పెరిగారు. హై స్కూల్ చదువు పూర్తయ్యాక, అల్లూరి తన సోదరి, సోదరుడితో కలిసి విశాఖపట్నం వెళ్లారు. అయితే సీతారామరాజు గ్రాడ్యుయేషన్ నాల్గవ సంవత్సరంలో అకస్మాత్తుగా వదిలి సన్యాసం స్వీకరించారు.

సీతారామరాజుకి చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు అబ్బాయి. సామాజిక అంశాలపై అవగాహన ఆయన్ను అనేక ప్రాంతాలు తిరిగేలా చేసింది. రెండు సార్లు ఉత్తర భారతదేశ యాత్ర సాగించిన సీతారామరాజు తొలిసారి 1916 ఏప్రిల్ 26వ తేదీన బెంగాల్ వెళ్లారు. ఆ తర్వాత కొంతకాలం కాశీలో ఉండి సంస్కృతం నేర్చుకున్నాడు. తొలిసారి యాత్రలో బరోడా, ఉజ్జయిని, అమృత్‌సర్, హరిద్వార్, బదరీనాథ్, బ్రహ్మకపాలం వంటి ప్రముఖ ప్రదేశాలు చూశాడు. 1918లో రెండోసారి ఉత్తరభారత యాత్రను చేపట్టిన సీతారామరాజు బస్తర్, నాసిక్, పూనా, బొంబాయి, మైసూరు వంటి ప్రాంతాల్లో పర్యటించాడు. సంస్కృతం, జోతిష్యశాస్త్రం, వాస్తుశాస్త్రం, ఆయుర్వేదం, విలువిద్య, గుర్రపు స్వారీలో ప్రావీణ్యం పొందిన సీతారామరాజు విశాఖపట్నం జిల్లా క్రిష్ణదేవిపేట ద్వారా మన్యంలోని అడుగుపెట్టాడు.

ఆ రోజుల్లో ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాగాతాలకు, దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యేవారు. మన్యంలో వనవాసీల జీవితం దుర్భరంగా ఉండేది. మన్యం ప్రజల దీన స్థితిగతులను పరిశీలించి, బ్రిటిష్ అధికారుల నిరంకుశ చర్యలకు వ్యతిరేకంగా విప్లవానికి నాంది పలికాడు. వనవాసీలకు అటవీ సంపదపై ఉన్న హక్కులను వివరించి..ధైర్యాన్ని పెంపొందించాడు. వారిలోని దురలవాట్లను దూరం చేసి, యుద్ధ విద్యలు, గెరిల్లా యుద్ధ పద్ధతులు నేర్పి వారిని పోరాటానికి సిద్ధం చేశాడు. ఆయన అనుచరుల్లో ముఖ్యులు గాము గంటందొర, గాము మల్లుదొర.

సీతారామరాజు 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్ స్టేషన్ పై తొలిసారి దాడి చేశారు. 23వ తేదీన క్రిష్ణదేవీపేట పోలీస్ స్టేషన్, 24న తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. ఈ మూడు స్టేషన్ల పై దాడి ద్వారా భారీగా ఆయుధాలను సేకరించుకొని సీతారామరాజు విప్లవం ప్రారంభించారు. ఇక అక్కడి నుంచి వరసపెట్టి పోలీస్ స్టేషన్ల పై దాడులు చేస్తూ బ్రిటిష్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. అలా పోలీస్ స్టేషన్లను లక్ష్యంగా చేసుకొని 1922 నుండి 1924 మధ్య కాలంలో రెండేళ్ల పాటు అనేక బ్రిటిష్ అధికారులను హతమారుస్తూ రవి అస్తమించని బ్రిటిష్ పాలకులను గడగడలాడించాడు. తాను ఫలానా చోట ఉన్నానని కావాలంటే యుద్ధం చేయమని బ్రిటిషర్లకు సీతారామరాజు సవాలు విసిరిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఆయన్ను ఎలాగైనా పట్టుకోవాలని బ్రిటిష్ ప్రభుత్వం గూఢచారుల ద్వారా ప్రయత్నాలు సాగించింది. సీతారామరాజు దళం లక్ష్యంగా బ్రిటిష్ ప్రభుత్వం మన్యానికి రూథర్‌ఫర్డ్‌ను కలెక్టర్‌గా నియమించింది. కృష్ణదేవిపేటలో సభ నిర్వహించిన రూథర్‌ఫర్డ్ విప్లవకారుల ఆచూకీ వారం రోజుల్లో చెప్పకపోతే ఆ ప్రాంతంలోని ప్రజలందరినీ కాల్చేవేస్తామని హెచ్చరించాడు.

రూథర్‌ఫర్డ్ మన్యం ప్రజలను నానా హింసలకు గురి చేశాడు. ప్రజలు పడుతున్న బాధలను చూసి చలించిపోయిన సీతారామరాజు లొంగిపోవాలని నిశ్చయించుకున్నాడు. 1924 మే 7న కొయ్యూరు గ్రామ సమీపంలోని ఒక ఏటి వద్ద కూర్చొని తాను ఉన్న చోటు గురించి సీతారామరాజు పోలీసులకు కబురుపంపాడు. ఏటి ఒడ్డున స్నానం చేస్తుండగా పోలీసులు సీతారామరాజును బంధించి అక్కడే ఉన్న ఓ చెట్టుకు కట్టేసి కాల్చి చంపారు. అలా తన ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన మన్యంవీరుడు 1924 మే 7న శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. రామరాజు ధైర్యసాహసాలు, దేశభక్తి, గెరిల్లా యుద్ధ నైపుణ్యం, మానవత్వం, వ్యక్తిగత జీవితంలో నిజాయతీ, క్రమశిక్షణ, తను నమ్మిన మార్గాన్ని ఆచరించడంలో నిబద్ధత, ప్రజల కార్యాచరణ పట్ల ఆయనకున్న విశ్వాసం మనకు నిరంతరం ఉత్తేజాన్నిస్తాయి.

అల్లూరి సీతారామరాజు స్మారకం ఆంధ్రప్రదేశ్‌లోని క్రిష్ణదేవిపేట గ్రామంలో ఉంది. 1986లో భారత ప్రభుత్వం స్వాతంత్ర్య పోరాటానికి ఆయన చేసిన ధైర్యసాహసాలకు గౌరవసూచకంగా పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. 2017 అక్టోబర్ 9న పార్లమెంట్ ప్రాంగణంలో సీతారామరాజు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్వవస్థీకరణలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని కొన్ని భాగాలను కలిపి విప్లవ కిశోరం పేరిట అల్లూరి సీతారామరాజు జిల్లాను 2022లో ఏర్పాటు చేశారు. తెలుగుజాతికి, దేశానికి స్ఫూర్తి ప్రదాత, వనవాసీలకు ఆరాధ్య దైవమని అల్లూరి సీతారామరాజు జయంతిని రాష్ట్రంలో ఘనంగా నిర్వహిస్తారు. అల్లూరి పోరాట త్యాగాల స్ఫూర్తితో వనవాసీల హక్కుల కోసం, ఉనికి కోసం పోరాటం కొనసాగించాలి. ఇదే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి.