ArticlesNews

‘యుకెలో హిందూద్వేషాన్ని మతద్వేష నేరంగా గుర్తించాలి’

86views

జులై 4న యునైటెడ్ కింగ్‌డమ్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఆ నేపథ్యంలో యుకెలోని హిందూ సంస్థలు ‘ది హిందూ మ్యానిఫెస్టో యుకె 2024’ విడుదల చేసాయి. హిందూ వ్యతిరేక ద్వేషాన్ని మతద్వేష నేరంగా గుర్తించాలని ఆ సంస్థలు విజ్ఞప్తి చేసాయి.

ఇంగ్లండ్‌లోని హిందూ సంస్థలు అన్నీ కలిసి ఏడు ప్రధాన డిమాండ్లతో ఒక మ్యానిఫెస్టోను జూన్ 8న విడుదల చేసాయి. హిందూద్వేషాన్ని మతద్వేష నేరంగా గుర్తించాలన్నది వాటిలో ప్రధాన డిమాండ్. దానితో పాటు… హిందువుల ఆరాధనా ప్రదేశాలను రక్షించడం, హిందువులకు చదువుకోడానికి సరైన అవకాశాలు కల్పించడం, హిందువులకు సమాన ప్రాతినిధ్యం, ఇమిగ్రేషన్ ప్రక్రియను సరళీకరించడం, ఆరోగ్య-సామాజిక భద్రతలను మెరుగుపరచడం, హిందూ ధార్మిక విలువలను గుర్తించి పరిరక్షించడం అనే ఆరు డిమాండ్లు ఆ మ్యానిఫెస్టోలో ఉన్నాయి.

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు తమతమ నియోజకవర్గాల్లోని హిందూ సమాజాలకు అండగా నిలవాలని హిందూసంస్థలు పిలుపునిచ్చాయి.

2002 సెప్టెంబర్‌లో లీసెస్టర్ ప్రాంతంలో హిందువులపై ముస్లిములు దాడులు చేసారు. దేవాలయంపై దాడి చేసి అక్కడి విగ్రహాలను ధ్వంసం చేసారు. దానికి ప్రతిస్పందనగా స్థానిక హిందూ యువకులు శాంతియాత్ర నిర్వహించారు.

ఇంగ్లీష్ మీడియా సంస్థలు హిందూ వ్యతిరేక పక్షపాత ధోరణితో వ్యవహరించి తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసాయి. యుకెలోని హిందూ సమాజానికి వ్యతిరేకంగా ఎన్నో కుట్ర సిద్ధాంతాలను ప్రచారంలో పెట్టారు. హిందూఫోబియాను వ్యాపింపజేసారు, ఆ తప్పుడు కథనాల ఆధారంగా హిందూ సమాజంపై దాడులు చేసారు అని ఆ బృందం స్పష్టం చేసింది.

అటువంటి పక్షపాత ధోరణికి వ్యతిరేకంగా, యుకెలోని హిందూ డయాస్పోరా తమ జీవితాలను హుందాగా గడిపేందుకు వీలుగా చట్టసభల ప్రతినిధులు సహకరించాలని హిందూ మ్యానిఫెస్టో కోరింది.