ArticlesNews

మమతామూర్తి జిల్లెళ్లమూడి అమ్మ

76views

( జూన్ 12 – జిల్లెళ్లమూడి అమ్మ వర్ధంతి )

పరిమిత ప్రేమ మానవత్వం, అపరిమిత మమకారం మాధవత్వం. ‘లోకాస్సమస్తా సుఖినో భవంతు’ అని కోరుకుంటే అది మాధవత్వం. మానవులను మాధవులుగా తీర్చిదిద్దడమే అమ్మ ఆశ మరియు ఆశయం. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో సీతాపతి, రంగమ్మ అనే పుణ్య దంపతులకు 1923 మార్చి 28న జిల్లెళ్లమూడి అమ్మ జన్మించారు. 1940లో జిల్లెళ్లమూడికి వచ్చి అక్కడ స్థిరపడ్డారు.

కుల మతాలకు, వర్గ వర్ణాలకూ అతీతంగా సమస్త సమాజాన్ని అక్కున చేర్చుకున్న అమరానందమయి, సామ్యవాద స్ఫూర్తిని ఆచరణీయంగా చేసిన ఆనందహేల శ్రీ జిల్లెళ్లమూడి అమ్మ. చండీయాగం, రుద్రయాగంలా మాతృయాగం చేయమని తన భక్తులకు చెప్పేవారు జిల్లెళ్లమూడి అమ్మ. రోగులకు ఔషధసేవ, అన్నార్తులకు భోజనసేవ, వృద్ధులు, నిరాశ్రయులకు వస్త్రసేవ ఇలా త్రివిధ సేవ చేయడమే మాతృయాగం.

‘అన్ని బాధలు కన్నా ఆకలి బాధ భయంకరమైనది, దుర్భరమైనది. అన్నం దొరక్క ఎవరూ మరణించకూడదు’, అని అమ్మ వెలిగించిన పొయ్యి అరవయ్యేళ్ళకు పైగా ఆరకుండా వెలుగుతోంది. అమ్మ దివ్య ఆశీస్సులతో 1971లో ప్రారంభమైన ‘మాతృశ్రీ విద్యా పరిషద్, 1978లో ప్రారంభమైన మాతృశ్రీ మెడికల్ సెంటర్ రెండూ విద్యా, వైద్య రంగాల్లో నేటికీ సేవలు అందిస్తున్నాయి.

అమ్మ తన 63వ ఏట అంటే 1985 జూన్ 12న పరమపదించారు. అమ్మ మరణానంతరం ఆమె భక్తులు ఒక గుడి నిర్మించి దానికి అనసూయేశ్వరాలయంగా నామకరణం చేసి అందులోనే అమ్మ భౌతికకాయాన్ని ఖననం చేసి ఆ ప్రదేశంలో అమ్మ నల్లరాతి విగ్రహం నెలకొల్పి ప్రతి సంవత్సరం మే 5న ఆమె పెళ్లి రోజును ఘనంగా నిర్వహిస్తున్నారు. మాతృపార్శ్యాన్ని ప్రపంచానికి రుచి చూపించిన మమతామూర్తి జిల్లెళ్లమూడి అమ్మ!!