Articlesvideos

యువతకు స్ఫూర్తి పాఠం మన ఆంధ్ర రత్నం దుగ్గిరాల గోపాలకృష్ణయ్య

70views

( జూన్ 10 – దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వర్ధంతి )

స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న వారిలో ఆంధ్రులు గణనీయంగానే ఉన్నారు. వారిలో రత్నంలాంటి వారు మన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. స్వాతంత్ర్యోద్యమంలో మహోజ్వల ఘట్టంగా చరిత్రకెక్కిన చీరాల-పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించింది దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారే. ఈయన ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగ్రంచిపోలు అనే కుగ్రామంలో శ్రీకోదండరామయ్య, శ్రీమతి సీతమ్మ అనే పుణ్యదంపతులకు 1889 జూన్ 2న జన్మించారు. ఉన్నత విద్యకు ఇంగ్లాండ్ వెళ్లారు. అక్కడి ఎడింబరో యూనివర్సిటీ నుంచి ఎం.ఏ. పట్టాను సంపాదించారు.

ఉన్నత విద్య అనంతరం స్వదేశానికి తిరిగివచ్చి కొది రోజులు రాజమండ్రి ట్రైనింగ్ కళాశాల, బందరు జాతీయ కళాశాలలో ఉపన్యాసకులుగా పని చేశారు. అనంతరం గాంధీగారి స్ఫూర్తితో 1919లో స్వాతంత్ర్య సమరరంగంలోకి దూకారు. 1919లో బ్రిటిష్ ప్రభుత్వం చీరాల-పేరాల మునిసిపాలిటీలను విలీనం చేసినప్పుడు అందుకు వ్యతిరేకంగా జరిగిన సహాయ నిరాకరణోద్యమానికి గోపాలకృష్ణయ్య నాయకత్వం వహించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలోనే ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్రదేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేశారు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించారు.

స్వాతంత్ర్యోద్యమంలో ప్రజలను చైతన్యులుగా చేయడానికి సాధన అనే ఆంగ్ల పత్రికను గోపాలకృష్ణయ్య స్థాపించారు. తెలుగునాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి ఆయన ఎంతగానో కృషి చేశారు.1921లో గుంటూరులో జరిగిన సభలో ‘‘ఆంధ్ర రత్న’’ బిరుదుతో గోపాలకృష్ణయ్యను సత్కరించారు. 40 సంవత్సరాల చిన్న వయసులో అనగా 1928 జూన్10న దివికేగారు. గోపాలకృష్ణయ్య నాయకత్వ పటిమను స్ఫూర్తిగా తీసుకొని నేటి యువతరం ఆయన అడుగుజాడల్లో నడవాలి. ఇదే మనం ఆయనకు అందించే నిజమైన నివాళి.