ArticlesNews

ఉదయగిరి విజయానికి అయిదు శతాబ్దాలు

77views

(శ్రీకృష్ణ దేవరాయలు ఉదయగిరి రాజ్యాన్ని జయించి 510 ఏళ్లు)

దక్షిణ భారత చరిత్రలో స్వర్ణయుగం విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయల కాలం. అప్పట్లో కళింగరాజ్యం అత్యంత బలమైనది. దీన్ని గజపతులు పాలిస్తూ ఉండేవారు. వారి రాజ్యం నెల్లూరు జిల్లా ఉదయగిరి వరకూ విస్తరించి ఉండేది. ఉదయగిరి విజయనగర రాజ్య సరిహద్దుల్లో ఉండి రాజ్య ముఖద్వారంగా ఉండేది. ప్రతాపరుద్ర గజపతి కళింగాధిపతి రాహుత్త రాయలను ఉదయగిరి కోట రక్షకునిగా నియమించాడు. శ్రీకృష్ణ దేవరాయలు ఉదయగిరిని ఎలాగైనా జయించాలని క్రీ. శ. 1513లో బయలుదేరాడు. ఉదయగిరిలో ఘోర యుద్ధం జరిగింది.
దుర్గ రక్షకుడు రాహుత్త రాయలకు అండగా ప్రతాపరుద్ర గజపతి తన సైనికులను పంపి కృష్ణరాయలను ఎదుర్కొన్నాడు. తాను స్వయంగా యుద్ధరంగంలో దూకి దుర్గాన్ని రాయలు చేజిక్కించుకొన్నాడు..
దుర్గాధిపతి రాహుత్త రాయలు తన స్వర్ణ కిరీటాన్ని బంగారు పళ్లెరంలో పెట్టి శ్రీకృష్ణదేవరాయలకు సమర్పించాడు. 1514 జూన్ 9న సాధించిన ఈ విజయాన్ని రాయలు తన ‘ఆముక్తమాల్యద’లో చెప్పుకున్నాడు. నంది తిమ్మన తన ‘పారిజాతాపహరణం’ లోనూ, అల్లసాని పెద్దన ‘మనుచరిత్ర’లోనూ ఉదయగిరి ముట్టడిని అభివర్ణించారు. పాశ్చాత్య చరిత్రకారులు కృష్ణరాయల ఉదయగిరి ముట్టడి 18 నెలలు సాగిందని పేర్కొన్నారు.
ఉదయగిరి విజయంతో రాయలు పూర్వ విజయనగర సామ్రాజ్యాన్ని పునరుద్ధరించినట్లయింది. ఉదయగిరి విజయం శ్రీ వెంకటేశ్వస్వామి దయ వల్లనే లభించిందని నమ్మిన రాయలు ఇక్కడి నుండి నేరుగా తిరుమలకు బయలుదేరాడు. క్రీ.శ. 1514 జూలై 6న స్వామి వారిని దర్శించుకున్నాడు. 30 వేల వరహాలతో స్వామి వారికి కనకాభిషేకం చేయించాడు. విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఉదయగిరి దుర్గాన్ని సాధించటం అత్యంత ప్రతిష్టాత్మక విజయంగా భావిస్తారు.