News

సాధువు కత్తి

74views

ఓ ఆధ్యాత్మిక సాధకుడు ఎన్నో ఏళ్లుగా దట్టమైన అడవిలో తపస్సు చేసుకుంటున్నాడు. అతడి తపోదీక్ష సాగుతుండగా.. దేవేంద్రుడు అతణ్ణి పరీక్షించాలనుకున్నాడు. ఒకరోజు ఆ మునీశ్వరుడి ముందు ప్రత్యక్షమై, ఒక ఖడ్గాన్ని ఇచ్చి.. ‘మునివర్యా! నేను పని మీద వెళ్తున్నాను. తిరిగొచ్చే వరకూ దీన్ని పదిలపరచండి. కొన్నాళ్ల తర్వాత తీసుకుంటాను’ అన్నాడు. మహర్షి అందుకు సమ్మతించి ఇంద్రుడి ఖడ్గాన్ని తీసుకున్నాడు. దాన్ని రక్షించేందుకు ముని నిరంతరం తనతోనే ఉంచుకునేవాడు. ఎక్కడికెళ్లినా కరవాలాన్ని నడుముకి ధరించేవాడు. సాధన నుంచి ఆయన మనసు కరవాలం మీదికి మరలింది. అంతేకాదు.. చేతిలో ఆయుధం ఉండేసరికి మధ్య మధ్యలో ఏమీ తోచక చెట్ల కొమ్మల్ని నరకటం, ఫలాల్ని కోయటం పనిగా పెట్టుకున్నాడు. దేవేంద్రుడు తిరిగొచ్చేసరికి.. ఖడ్గం ప్రభావంతో అతడి ప్రవృత్తే మారిపోయింది. సాత్వికుడు కాస్తా రాజసికుడిగా మారాడు. ఇది రామాయణంలో సీతాదేవి చెప్పిన కథ. చెంతనున్న వస్తువులు మన మనసుపై ప్రభావాన్ని చూపుతాయనే హెచ్చరిక ఇది. ఆధ్యాత్మిక సాధనలో ఉన్నప్పుడు ప్రతికూలతను చూపే వ్యక్తులకే కాదు, వస్తువులకూ దూరంగా ఉండాలని, సాంగత్య ప్రభావంతో మనసు మారిపోతుందని మన ధర్మగ్రంథాలు ప్రబోధిస్తున్నాయి.