ArticlesNews

ఎన్నికల ఫలితాల తర్వాత కేరళ ప్రభుత్వానికి చర్చ్ హెచ్చరిక

105views

లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని అధికార ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఆ వెంటనే పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వానికి జాకోబైట్ సిరియన్ క్రిస్టియన్ చర్చ్ హెచ్చరిక జారీ చేసింది. ఈ ఎన్నికల ఫలితాల నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోతే కేరళలో సీపీఎం నేతృత్వంలోని ప్రభుత్వానికి బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో పట్టిన గతే పడుతుందని హెచ్చరించింది.

జాకోబైట్ సిరియన్ క్రిస్టియన్ చర్చ్‌కు చెందిన నీరానం డయోసీస్‌కు చెందిన మతాధికారి జీవార్గీస్ మార్ కూరిలోస్ లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టారు. అందులో సిపిఎంను, ఎల్‌డిఎఫ్ ప్రభుత్వాన్నీ ఘాటుగా విమర్శించారు. పినరయి ప్రభుత్వం వైఫల్యాలను, వారి అహంకారాన్నీ దుమ్మెత్తిపోసారు. ప్రజలకు కొన్ని ఆహార పదార్ధాలు పంచిపెట్టి, ఎన్నికల్లో గెలిచేస్తామనుకుంటే అంతకుమించిన మూర్ఖత్వం ఉండదని వివరించారు. ‘సిపిఎం తమ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకపోతే పశ్చిమబెంగాల్, త్రిపురలో ఎదురైన పరిస్థితే తలెత్తుతుంద’ని హెచ్చరించారు.

సిపిఎం ఘోరమైన ఓటమికి కారణాలను కూరిలోస్ అంచనా వేసారు. వామపక్ష విద్యార్ధి విభాగం ఎస్ఎఫ్ఐ రాజకీయ హింసాకాండ, ప్రతిపక్షాల విమర్శల పట్ల తీవ్ర అసహనం, ఓటుబ్యాంకు కోసం బుజ్జగింపు విధానాలు, పనికిమాలిన ఆర్థిక నిర్ణయాలు, వనరుల దుర్వినియోగం, సహకార బ్యాంకుల్లో అంతులేని అవినీతి, మీడియాపై శత్రుత్వం, సాధారణ పౌరులపై పోలీసుల అమానుషకాండ.. ఆ కారణాల వల్లే తాజాగా ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎం దారుణ పతనానికి కారణమని విశ్లేషించారు. కేరళలో సీపీఎం అళత్తూర్ నియోజకవర్గంలో మాత్రమే గెలిచింది. చాలా స్థానాల్లో మూడో స్థానానికి పడిపోయింది. భవిష్యత్తులో కేరళ రాజకీయాల్లో గణనీయమైన మార్పు కనిపిస్తుందన్న సంకేతాలనిస్తున్నాయి.