News

కొత్త ప్రభుత్వంతో చర్చలకు త్వరలో ఢిల్లీకి అమెరికా ప్రతినిధి

65views

కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాల కోసం అమెరికా ప్రయత్నాలను మొదలుపెట్టింది. తమ దేశ జాతీయ భద్రతా సలహాదారు (NSA) జాక్‌ సలీవాన్‌ను భారత్‌ పంపాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని శ్వేతసౌధం ప్రకటించింది. ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఫోన్‌ చేసిన సందర్భంగా ఈ విషయం చర్చకు వచ్చింది. ‘‘బైడెన్‌ నేడు ప్రధాని మోదీకి ఫోన్‌ చేశారు. ఈ సందర్భంగా త్వరలో జాతీయ భద్రతా సలహాదారు న్యూదిల్లీ పర్యటన ప్రస్తావనకు వచ్చింది. కొత్త ప్రభుత్వంతో భారత్‌-అమెరికా ప్రధాన్యాలపై చర్చించనున్నారు. వీటిల్లో సాంకేతిక భాగస్వామ్యం, వ్యూహాత్మక బంధం, పరస్పర విశ్వాసం వంటి అంశాలు ఉండనున్నాయి’’ అని శ్వేత సౌధం ఓ ప్రకటనలో తెలిపింది.

అమెరికా ఎన్‌ఎస్‌ఏ పర్యటన తేదీలను తర్వలోనే ప్రకటించనున్నారు. ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం జరిగిన కొన్ని రోజుల్లోనే ఈ పర్యటన చోటు చేసుకోనుంది. ఇక అమెరికాలోని కీలక నాయకులు కూడా ప్రధానికి అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు. సెనెట్‌ ఫారెన్‌ రిలేషన్స్‌ కమిటీ ఛైర్మన్‌ బెన్‌ కార్డిన్‌ భారత ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. ‘‘ఎండలను లెక్కచేయకుండా భారత ప్రజలు ఓట్లు వేసి ప్రజాస్వామ్య విధానాలపై ఉన్న గౌరవాన్ని చాటుకొన్నారు. రానున్న సంవత్సరాల్లో ప్రపంచాన్ని సుసంపన్నం చేసేందుకు భారత్‌-అమెరికా భాగస్వామ్యం మరింత బలపడుతుంది’’ అని పేర్కొన్నారు.