ArticlesNews

విభూతి మహిమతో పుణ్యలోకంగా మారిన కుంభీపాకం

81views

శైవులు విభూతిని ధరిస్తుంటారు. ముఖానికి, చేతులకు, వక్షస్థలానికి విభూతి రేఖలను అలంకరించుకుంటూ ఉంటారు. విభూతి పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైంది. దీనిని ధరించిన వారు నరకాల పాలు కాకుండా స్వామి రక్షిస్తాడని నమ్మకం.

దేవీభాగవతం పదకొండో స్కందంలో త్రిపుండ్ర విభూతి విశిష్టతను తెలిపే కథ ఒకటి ఉంది.
ఒకనాడు దూర్వాస మునీంద్రుడు మూడు పుండ్రాలుగా (రేఖలుగా) విభూతిని ధరించి పితృలోకానికి వెళ్లాడు.పార్వతీదేవి సమేతమై ఉన్న పరమేశ్వరుడికి నమస్కరించి వెనువెంటనే జరిగిన ఘోరం గురించి తెలిపారు. కుంభీపాక నరకం ఉన్నట్లుండి స్వర్గధామంగా మారిపోయిందని, దానికి కారణమేమిటో తెలియడం లేదని, పాపులంతా అలా స్వర్గసుఖాలను అనుభవించటం ధర్మవిరుద్ధం కదాని విన్నవించారు. శివుడు వారి మాటలను విని.. చిరునవ్వు నవ్వి.. దీనిలో వింత ఏమీ లేదు. నరకకూపం దగ్గరకు దూర్వాసుడు వెళ్లి లోనికి తొంగి చూసిన సమయంలో ముని నుదుటి మీద ఉన్న మూడు విభూతి రేఖల్లోని కొన్ని అణువులు వెళ్లి ఆ కూపంలో పడ్డాయి. ఆ పవిత్ర అణువుల ప్రభావమే ఇది అని చెప్పారు.
పరమేశ్వరుడు ఆ కుంభీపాక కూపాన్ని పితృదేవతలకు పనికి వచ్చే ఉత్తమ తీర్థంగా మార్చారు. ఆ తీర్థం పక్కనే శివపార్వతుల మూర్తులను ప్రతిష్ఠించమని చెప్పి ఆ మూర్తులు పూజలందుకుంటారని, ఆ ప్రాంతం పితృతీర్థంగా మారిపోతుందని చెప్పాడు. యముడు చేసేదిలేక పితృలోకానికి చాలా దూరంగా మళ్లీ ఒక కొత్త కుంభీపాక నరక కూపాన్ని నిర్మించి పరిసరాలకు విభూతి ధరించిన శివభక్తులెవరూ రాకుండా కట్టడి చేశాడు. విభూతిలోని కొన్ని కణాలకే అంతటి మహత్తర శక్తి ఉందని ఈ కథ తెలుపుతోంది. అందుకే విభూతిని ధరించటం మనతో పాటు ఇతరులకు శుభాన్ని అందిస్తుంది.