ArticlesNews

ఆదివాసీల సముద్దారకుడు వెన్నెలకంటి రాఘవయ్య

59views

(జూన్ 4 – వెన్నెలకంటి రాఘవయ్య జయంతి)

స్వాతంత్ర్య సమరంలో పాల్గొని జైలుకెళ్లిన యోధునిగా కన్నా… అమాయక ఆదివాసీల సముద్దారకునిగా వెన్నెలకంటి రాఘవయ్య ప్రసిద్ధులు. నెల్లూరు జిల్లా కోవూరు తాలూకాలోని శింగపేట గ్రామంలో ఆయన 1897 జూన్ 4న జన్మించారు.

1946 వరకు భారతదేశంలో గిరిజనుల పట్ల శాపం గా మారిన అతి భయంకరమైన, క్రూరమైన ‘క్రిమినల్ ట్రైబ్స్ ఆక్ట్-1871’ను రద్దు చేయించడంలో రాఘవయ్యది ప్రధాన పాత్ర. బ్రిటిష్ వాళ్లు ఈ దేశ సంపదను దోచుకోవడానికి అవసరమైన రోడ్లు వేయడానికి, బ్రిడ్జ్ లు కట్టడానికి, రైల్వే ట్రాక్లు నిర్మించడానికి, తమ బానిసలుగా పని చేయడానికి… గిరిజనులను దొంగలు, దోపిడీ దారులుగా చిత్రీకరించింది ఈ చట్టం. ఈ చట్టం వలన ఈ గిరిజనులను ఊళ్లలోకి రానిచ్చే వారు కాదు. రాఘవయ్య పోరాట ఫలితంగా 1947లో ఈ చట్టాన్ని తొలగించారు.
రాఘవయ్య ‘ఆది ఆంధ్ర సంఘా’న్ని స్థాపించి యానాదులు, ఎరుకలు, లంబాడీలు, చెంచులు, కోయలు, బుడబుక్కల వంటి సంచార జాతులను సమీకరించి, సంఘటితం చేసి వారిలో అనేక మార్పులకు కారణం అయ్యారు.ముఖ్యంగా చెట్టుకొకరు, పుట్టకొకరు గుడిసెలు వేసుకుని మిగిలిన సమాజంతో సంబంధం లేకుండా వెలివేసినట్లు బ్రతుకుతున్న యానాదులకు కాలనీలు నిర్మించారు. వారి పిల్లలు చదువుకునేందుకు పాఠశాలలు, బాలబాలికలకు వేర్వేరు హాస్టళ్ళు నిర్మించి విద్యను అందించడంలో మరువరాని కృషి చేశారు. సంచార గిరిజనుల గురించీ, వారి సమస్యల గురించీ దాదాపు ఇరవైకి పైగా విశిష్ట గ్రంథాలు రాశారాయన.

అటువంటి ప్రజాసేవకుడు 1981, నవంబరు 24న తుదిశ్వాస విడిచినా, ఆయన సేవలు అజరామరం. ఆయన స్ఫూర్తి అనంతం.