News

అమెరికా గడ్డపై భారత్- పాక్ మ్యాచ్‌కు ఉగ్ర ముప్పు!

114views

అమెరికా గడ్డపై తొలిసారి జరగనున్న టి20 ప్రపంచకప్‌ మ్యాచ్‌ల కోసం అటు ఐసిసి, ఇటు పోలీసులు కట్టుదిట్టమైన నిఘాల మధ్య భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ముఖ్యంగా జూన్‌ 9వ తేదీన భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఇక్కడి ‘నాసా కౌంటీ క్రికెట్‌ స్టేడియం’లో జరిగే మ్యాచ్‌ భద్రతకు సంబంధించి అధికారులు అదనపు దృష్టి పెట్టారు.

ఈ మ్యాచ్‌కు తీవ్రవాద ముప్పు ఉన్నట్లు సమాచారం ఉండటంతో అన్ని వైపుల నుంచి పోలీసులు అప్రమత్తమై జాగ్రత్త చర్యలు చేపట్టారు. గతంలో ఎన్నడూ చూడని భద్రతా ఏర్పాట్లు ఇక్కడ కనిపించబోతున్నాయి అని ఒక పోలీస్‌ ఉన్నతాధికారి చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో పెద్ద సంఖ్యలో జనాలను లక్ష్యంగా చేస్తూ ఏక వ్యక్తి చేసే ‘వుల్ఫ్‌ అటాక్‌’ తరహా దాడులకు ఆస్కారం ఉందని భావిస్తుండటంతో వాటిని నివారించేందుకు అడుగడుగునా పోలీసులను మోహరిస్తున్నారు.

మ్యాచ్‌ జరిగే రోజు ఐసన్‌ హౌవర్‌ పార్క్‌ పరిసరాలన్నీ పోలీసుల ఆధీనంలో ఉంటాయి. తాము ఏ విషయంలో కూడా ఉదాసీనత ప్రదర్శించబోమని నాసా కౌంటీ ఎగ్జిక్యూటివ్‌ బ్రూస్‌ బ్లేక్‌మన్‌, పోలీస్‌ కమిషనర్‌ ప్యాట్రిక్‌ రైడర్‌ వెల్లడించారు. ప్రతీ రోజూ నాసా కౌంటీ సహా ఇతర నగరాలకు కూడా బెదిరింపు కాల్స్‌ వస్తుంటాయని, తాము ఏ ఒక్కదాన్ని తేలిగ్గా తీసుకోబోమని తెలిపారు.