News

64.2 కోట్ల మంది ఓటేశారు.. ప్రపంచ రికార్డు సృష్టించామన్న ఈసీ

78views

మరికొద్ది గంటల్లో వెలువడనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం యావత్‌ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియను (Lok Sabha Elections) విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటు వేయడంతో మనం ప్రపంచ రికార్డు సృష్టించినట్లు వెల్లడించారు.

తాజా ఎన్నికల్లో మొత్తం 64.2 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జీ7 దేశాల్లోని మొత్తం ఓటర్ల కంటే ఈ సంఖ్య 1.5 రెట్లు ఎక్కువ. ఐరోపా సమాఖ్యలోని 27 దేశాల ఓటర్ల కంటే 2.5 రెట్లు ఎక్కువ కావడం విశేషం. మన దేశంలో మొత్తం 96.88కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సమయంలో ఈసీ వెల్లడించింది.

ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లు పోటెత్తారు. 31.2 కోట్ల మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో మహిళా ఓటర్లకు స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చారు.

గత నాలుగు దశాబ్దాలతో పోలిస్తే జమ్మూకశ్మీర్‌లో అత్యధిక ఓటింగ్‌ శాతం నమోదైంది. మొత్తం అక్కడ 58.58శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కశ్మీర్‌ లోయలో 51.05శాతం పోలింగ్‌ నమోదైంది.