News

ఓ రాజ్య పరిపాలకురాలిగా ఆదర్శ మూర్తి రాణి అహల్యా బాయి : మోహన్ భాగవత్

303views

హిందూ దేవాలయాలను జీర్ణోద్ధరణ చేయించిన రాజమాత దేవీ అహల్యబాయి హోల్కర్‌. అనేక సత్రాలు కట్టించారు. కాశీ ఆలయం, కేదారనాథ్‌, గయ, ప్రయాగ, శ్రీశైలం, రామేశ్వరం, పూరి జగన్నాథాలయం… ఇలా అనేక ధర్మ కార్యాలు చేశారు. ఆవిడ మంచి పరిపాలనాదక్షురాలు. ప్రతి రోజూ నర్మదా నదిలో స్నానం ఆచరించి, మట్టితో శివలింగాన్ని తయారు చేసి ఆ లింగం సాక్షిగా న్యాయనిర్ణయం చేసేవారు. నేటితో అహల్యాబాయి హోల్కర్‌ జయంతి. త్రిశతాబ్ది వేడుకలు దేశమంతటా జరుపుకుంటున్నాం. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు సరసంఘ చాలక్‌ ప.పూ. మోహన్‌ భాగవత్‌ జాతినుద్దేశించి అహల్యాబాయి గురించి మాట్లాడారు. ఆ ప్రసంగం యథాతథంగా…

ఈ సంవత్సరం పుణ్యశ్లోక్‌ దేవి అహల్యాబాయి హోల్కర్‌ 300 వ జయంతి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె వ్యక్తిత్వం మనకు ఆదర్శం. దురదృష్టవశాత్తు ఆమెకు చిన్న తనంలోనే వైధవ్యం వచ్చింది. ఒంటరి మహిళ అయినా, అంత పెద్ద రాజ్యాన్ని పరిపాలించడమే కాకుండా… విస్తరించడం కూడా చేసింది. కేవలం విస్తరించడమే కాకుండా.. సుపరిపాలన కూడా అందజేసింది. అసలు రాజ్య పరిపాలకురాలు ఎలా వుండాలో అహల్యాబాయి ఉదాహరణగా నిలిచింది. ఆమె పేరు ముందు ‘‘పుణ్యశ్లోక’’ అన్న పేరు కూడా చేర్చబడిరది. ప్రజలను దు:ఖం నుంచి, ఆపదల నుంచి విముక్తి చేసింది కాబట్టే ఆమె పేరు పక్కకు ఈ పదం చేర్చారు. అప్పట్లో రాజ్యాలను ఆదర్శంగా పాలించేవారేవరైతే వున్నారో.. ఆ జాబితాలో అహల్యాబాయి హోల్కర్‌ కూడా ఒకరు.ఇప్పటి పరిస్థితుల్లో కూడా ఆమె మనకు ఆదర్శప్రాయురాలు. ఆమెను ఆదర్శంగా తీసుకుంటూ.. యేడాది పొడువునా స్మరించుకొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది చాలా సంతోషించదగ్గ విషయం.