ArticlesNews

సర్వలక్షణ శోభితుడు ‘సుందర’ నాయకుడు

87views

(జూన్ 1 – హనుమత్జయంతి )

శ్రీమద్రామాయణం విచిత్ర మణిహారం. అందులోని పాత్రలన్నీ అనర్ఘరత్నాలే. ఈ మహా కావ్య నాయకుడు శ్రీరామచంద్రమూర్తి తరువాత అంతటి ఉన్నత స్థానం అందుకున్నవాడు హనుమే. ఈ కావ్యానికి తలమానికంగా భావించే ‘సుందరకాండ’లో ఆయన పరాక్రమం, కార్యదీక్ష, స్వామి భక్తి, బుద్ధికుశలత, రాజనీతిజ్ఞత, యుక్తాయుక్త విచక్షణ తదితర సుగుణాలు వెల్లడవుతాయి. ఆంజనేయుడు దాస్యభక్తికి ప్రథమోదాహరణ. వ్యక్తిత్వ వికాస నిపుణుడు. మాటకారి. నిర్భయత్వం, అమోఘమైన వాక్చాతుర్యం, అపారమైన బుద్ధిబలం, అద్భుత పాండిత్యాలకు గని. కార్యాకారణ విచక్షణ, యుక్తాయుక్త వివేకం కలవాడు. ఒక్కమాటలో బహునేర్పరి. వాల్మీకి మహర్షి అడుగడుగున ‘శ్రీమాన్‌’ అని వర్ణించగా, ‘అన్నిటా నేరుపరి హనుమంతుడు / పిన్ననాడే రవినంటె పెద్ద హనుమంతుడు’ అని పదకవితా పితామహుడు అన్నమాచార్య కీర్తించారు.

యువతకు హనుమే ఆదర్శం
స్వామి (యజమాని) కార్యం కోసం శక్తియుక్తులు ధారపోయాలని, అహం దారిచేరనీయక సంకల్ప బలం, మనోనిశ్చయం కలిగి నిరంతరం శ్రమించా లన్నది హనుమ సందేశం. రామాయణంలో వివిధ సన్నివేశాలలో ఆయన నడతను ఆదర్శంగా తీసుకోవాలని రామకృష్ణ పరమహంస, వివేకానంద లాంటి జిజ్ఞాసువులు హితవు పలికారు.‘కార్య సఫలతకు అవసరమైన దీక్ష, ధైర్యం,వినయం, త్యాగం, ఆత్మవిశ్వాసం, అంకిత భావం, బుద్ధికుశలత ప్రధాన లక్షణాలు సంపూర్ణంగా గల హనుమ యువతకు ఆదర్శం. ఆయన స్ఫూర్తితో యువత జీవితాలను తీర్చిదిద్దుకోవాలి’ అన్నారు స్వామి వివేకానంద.

ప్రాంతీయ అచారాలను బట్టి వివిధ తిథులలో హనుమజ్జయంతిని జరుపుకుంటారు. తెలుగువారు పరాశర సంహితను అనుసరిస్తూ వైశాఖ బహుళ దశమి నాడు నిర్వహించుకుంటారు. ద్వైత సంప్రదాయపరులకు హనుమజ్జయంతి ప్రధాన పండుగ. వారు ఆయనను ‘ముఖ్య ప్రాణదేవుడు’ సంభావిస్తారు. హనుమదుపాసకులు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తారు.