ArticlesNews

సూదిలా అల్లుకు పోవాలి

91views

కుటుంబ ప్రభోధన్

ప్రస్తుతం బాగా దెబ్బతింటున్న వ్యవస్థలలో కుటుంబ వ్యవస్థ ముందు వరుసలో ఉంది.. కుటుంబమంటే కేవలం భార్యా, భర్త పిల్లలేనా! అటు భర్త వైపు బంధాలు, ఇటు భార్యవైపు బంధాలు కూడా కుటుంబమే.. ఎప్పుడయితే పెళ్లై రెండు జీవితాలు ముడిపడ్డాయో భర్తవైపు వారందరినీ పూర్తిగా తనవారు అని భార్య అనుకోవాలి. భార్యవైపు అందరినీ తనవారని భర్త అనుకోవాలి.. ఇరువైపులా అత్తమామలు తమ తల్లితండ్రుల లాంటివారే అనుకోవాలి. మన అన్నదమ్ములు, మన అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలని కోరుకునే ఒక ఇల్లాలు అత్తామామలను కూడా ఆదరించాలి.

అలాగే…. తమ కూతురుని ఆమె అత్తామామలు ఆదరించాలని కోరుకునేవారు తమ కోడలును ఆదరించాలి. చాలా వరకు పెళ్ళి అయ్యాక భార్య తన పుట్టింటి బంధాలను వదులుకోవాల్సి వస్తుంది.. అలాగే కొన్నిసార్లు భర్త కూడా వదులుకోవాల్సి వస్తుంది.. నిజంగా ఇది ఆలోచించాల్సిన విషయం…ఎవరి రక్తసంబంధాన్ని విడదీసే హక్కు ఎవరికీ లేదు. ప్రపంచంలో రూపాయలతో కొనలేనిది కేవలం రక్త సంబంధాన్ని మాత్రమే… “కత్తెరలా బంధాలను విడదీయడం కాదు, వీలయితే సూదిలా అల్లుకు పోవాలి.” మనమందరితో బాగున్నప్పుడే మన పిల్లలు బంధాల విలువను తెలుసుకుంటారు.. ఎందుకంటే పిల్లలు పెద్దలను చూస్తూ పెరుగుతారు, నేర్చుకుంటారు.

మనం వారసత్వంగా మన పిల్లలకు ఇవ్వాల్సింది ఆస్తులు, భూములు కాదు. వ్యక్తిత్వాన్ని, విలువలను, బంధాలను, బంధువులను ఇవ్వాలి. అందరూ మనకి నచ్చినట్లుండరు… మనం నదిలా అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగాలి.. వెంటరాని ఆస్తుల కోసం పంతాలు, పట్టింపుల కోసం రక్తసంబంధాలను దూరం చేసుకుంటే ఎలా! మనల్ని కనిపెంచిన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో వేదనకు గురి కాకుండా చూసుకోవాలి… మనం తలచుకుంటే “వసుదైక కుటుంబం” ఏర్పరచగలం..