ArticlesNews

సజ్జన సహవాసం.. మాలిన్య ప్రక్షాళనం

90views

సత్సాంగత్యం వల్ల అసంగత్వం ఏర్పడి మోహం, భ్రాంతి తొలగిపోతాయి. అప్పుడిక మనసు నిశ్చలమై ముక్తి లభిస్తుంది. ఆదిశంకరాచార్యుల వారి ‘మోహముద్గరం’గా పేరొందిన 31 శ్లోకాల ‘భజగోవిందం’లో తొమ్మిదో శ్లోకమిది.
సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలతత్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః

భగవత్‌ చింతన వల్ల సద్భక్తుల సహవాసం లభిస్తుంది. ఆ సహవాసం ముక్తికి సోపానమై, జన్మ చరితార్థమవుతుంది. సత్కర్మాచరణ, సత్యనిష్ఠ, సాధు సత్పురుషుల సాంగత్యం వల్ల మోహం నశిస్తుంది. పెడదారి పట్టిన మనసును సరిదిద్దే గొప్ప అవకాశం సత్సంగత్వం. సత్సాంగత్యం వల్ల మోహం, భ్రాంతి నశిస్తాయి. మనసు నిర్మోహమై, నిశ్చలమవుతుంది. అంతఃకరణ శుద్ధమై, పరమాత్మకు నిలయం అవుతుంది. అప్పుడే జీవన్ముక్తి. ఉదాహరణకు ఇనుముకు మట్టి అంటితే తుప్పు పడుతుంది. అదే ఇనుమును నిప్పులో కాలిస్తే తిరిగి మెరుస్తుంది. సజ్జనులతో సహవాసం నిప్పు లాంటిది. మనలోని మాలిన్యాలను ప్రక్షాళన చేసి అంతరంగాన్ని పరిశుద్ధం చేస్తుంది. క్రమేపీ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకుని, అద్వైతానందానుభూతిని పొందవచ్చు.