ArticlesNews

అభ్యుదయ ఆది శిఖరం కందుకూరి వీరేశలింగం పంతులు

99views

(మే 27 – కందుకూరి వీరేశలింగం పంతులు వర్ధంతి )

తెలుగు జాతి గర్వించదగిన మహోన్నత వ్యక్తులలో ముఖ్యులు కందుకూరి వీరేశలింగం పంతులుగారు. ఆయన తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు. బాల్య వివాహాల రద్దు కోసం ఉద్యమించిన మహోన్నతుడు, సంఘ సంస్కర్త. కందుకూరి వీరేశలింగం పంతులు 1848వ సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పున్నమ్మ, సుబ్బారాయుడు దంపతులకు జన్మించారు. పుస్తకాలు చదివి ప్రభావితులై సామాజిక దురాచారాల నిర్మూలన దిశగా కృషి చేశారు.

దేశంలో మొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి వీరేశలింగం కావడం విశేషం. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ఆయనే ప్రవేశపెట్టారు. స్త్రీ విద్య కోసం ఉద్యమించిన వీరేశలింగం పంతులుగారు బాలికల కోసం పాఠశాలను స్థాపించారు. బ్రిటిష్ హయాంలో జరుగుతున్న బాల్య వివాహాలకు నిరసనగా ఆయన ఉద్యమమే నిర్వహించారు. సమాజంలోని దురాచారాలపై తన భావాలను వ్యాప్తి చెయ్యడానికి 1874 అక్టోబరులో వివేకవర్థని అనే పత్రికను ప్రారంభించారు. యుగకర్తగా, హేతువాదిగా ప్రసిద్ధి పొందిన పంతులుగారికి గద్య తిక్కన అనే బిరుదు ఉంది. మొదటి స్వీయ చరిత్ర, తొలి నవల, తొలి ప్రహసనం, తొలి తెలుగు కవుల జీవిత చరిత్ర రాసిన మొదటి వ్యక్తిగా ఆయన ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.

సంఘ సేవలో వీరేశలింగం ఎంత కృషి చేసారో, సాహిత్యంలోనూ అంతే కృషి జరిపారు. కందుకూరి 130కి పైగా గ్రంథాలు రాశారు. ఆంధ్ర సమాజాన్ని సంస్కరణల బాట పట్టించిన కందుకూరి వీరేశలింగం పంతులు గారు 1919 మే 27న తుదిశ్వాస విడిచారు. జీవితాంతం సమాజ సేవకే అంకితమైన వారి ఆశయసాధనకు మనమంతా కృషి చేద్దాం.